Cancer | రొమ్ము క్యాన్సర్ స్త్రీలకు సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటాం. అరుదుగా అయినా.. ఈ ఇబ్బంది పురుషుల్లో కూడా తలెత్తుతుంది. తొలిదశలోనే నిర్ధారించుకుని చికిత్స తీసుకోవాలి. మొత్తం క్యాన్సర్ కేసులలో ఒక శాతం లోపే ఉన్నా.. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని విస్మరించలేం.
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ విషయంలో.. ప్రపంచ దేశాల్లో బ్రెజిల్ ముందు వరసలో ఉంది. జపాన్, సింగపూర్‌ల్లో మాత్రం అతి తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. భారత్‌లో అయితే.. మొత్తం రొమ్ము క్యాన్సర్ కేసులలో.. పురుషులతో ముడిపడినవి ఒక శాతం కంటే తక్కువే. ఈ సమస్య అరవై, డబ్భు ఏండ్ల వయోధికుల్లో ప్రధానంగా కనిపిస్తున్నది. వయసు పెరిగేకొద్దీ ముప్పూ పెరుగుతుంది.
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌కు వయసే పెద్ద శత్రువు. వయసు పెరిగేకొద్దీ ముప్పూ పెరుగుతుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో చిన్న వయసులోనే ఈ సమస్య దాపురిస్తున్నది. దీనికి అనేక కారణాలు. ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలలో హెచ్చు తగ్గులు రొమ్ములో అసహజమైన కణాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. హార్మోన్ సమస్యలకు వాడే మందులు, ఊబకాయం మొదలైనవి పురుషుల్లో ఈస్ట్రోజెన్ స్థాయులను పెంచుతాయి. కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు కూడా పురుషుల్లో.. ఆండ్రోజెన్ అనే పురుష హార్మోన్ల ఊట తక్కువగా, స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజెన్ ఊట ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి రొమ్ము క్యాన్సర్ ముప్పునకు దారితీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘క్లయిన్ఫెల్టర్ సిండ్రోమ్’ అంటారు. తోటి మగవారితో పోలిస్తే పలుచటి గడ్డం, వృషణాలు మరీ చిన్నగా ఉండటం, వీర్య ఉత్పత్తి లోపించడం .. ఈ రోగుల లక్షణాలు. కుటుంబంలోని పురుషుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నా, జన్యువుల్లో అసాధారణత నెలకొని ఉన్నా.. ముప్పు మరింత పెరుగుతుంది.
లింఫోమా (శోషరస వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్), ఎముకల్లో ట్యూమర్లు, గాయాల మచ్చల చికిత్సలో భాగంగా.. ఛాతీకి రేడియేషన్ చేయించుకునేవారికి కూడా రొమ్ము క్యాన్సర్ ఆస్కారం ఎక్కువే. అంతేకానీ, రొమ్ముల పరిమాణం పెరిగినంత మాత్రాన క్యాన్సర్‌గా భావించలేం. దీన్ని వైద్య పరంగా ‘గైనకోమాస్టియా’ అంటారు. కొన్ని మందుల చెడు ప్రభావం, మితిమీరిన మద్యం, మితి మీరిన బరువు వల్ల కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇది చాలావరకు హార్మోన్ అసమతౌల్యం వల్ల వచ్చే వ్యాధి. తొలిదశలో అయితే సర్జరీ చేస్తారు. ఆ తర్వాత, హార్మోన్ థెరపీ అవసరం అవుతుంది. ముదిరితే కీమోథెరపీ, రేడియేషన్ తప్పకపోవచ్చు.