Vitamin C Foods | చలికాలంలో మనకు సహజంగానే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. చలి ఎక్కువయ్యే కొద్దీ శరీరం మరింతగా శ్రమించాల్సి వస్తుంది. శరీరం తనను తాను వేడిగా ఉంచుకునేందుకు యత్నిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు చేస్తుంది. అలాగే చలికి రక్తనాళాలు సైతం కుచించుకుపోతాయి. దీంతోపాటు రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా బీపీ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుంది. చలికాలంలో చాలా మంది అందువల్లనే హార్ట్ ఎటాక్ బారిన పడుతుంటారు. అలాగే ఈ సీజన్లో మన ఇమ్యూనిటీ పవర్ సైతం తగ్గుతుంది. దీంతో పలు రకాల వైరస్లు, బ్యాక్టీరియా మన శరీరంపై దాడి చేస్తుంటాయి. అందువల్ల చలికాలంలో మనం తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఆహారాలను తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
విటమిన్ సి నీటిలో కరిగే పోషక పదార్థం. అందువల్ల మనం విటమిన్ సి ని ఎక్కువగా తీసుకున్నా శరీరం తనకు కావల్సినంత విటమిన్ సి ని మాత్రమే ఉపయోగించుకుంటుంది. మిగిలిన విటమిన్ సి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. మనకు రోజూ శరీరానికి తగినంత విటమిన్ సి అవసరం ఉంటుంది. కెనడాకు చెందిన మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితం అయిన అధ్యయనం ప్రకారం విటమిన్ సిని మనం తగినంతగా తీసుకుంటే చలికాలంలో మనకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని తేలింది. కనుక ఈ సీజన్లో విటమిన్ సి ఉండే ఆహారాలను మనం ఎక్కువగా తినాల్సి ఉంటుంది.
మరో అధ్యయనం చెబుతున్న ప్రకారం విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల జలుబు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేల్చారు. కాబట్టి మన శరీరానికి సరిపడా విటమిన్ సి లభించేలా చూసుకుంటే జలుబు నుంచి దూరంగా ఉండవచ్చు. మనకు విటమిన్ సి అనేక రకాల ఆహారాల్లో సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా కివీ పండ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను 100 గ్రాముల మేర తింటే సుమారుగా 161.3 మిల్లీగ్రాముల మేర విటమిన్ సిని పొందవచ్చు. విటమిన్ సి మనకు కివి పండ్ల ద్వారా అధికంగా లభిస్తుంది. ఒక కివి పండును తింటే చాలు మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో 230 శాతం వరకు అదనంగా లభిస్తుంది.
స్ట్రాబెర్రీలలోనూ విటమిన్ సి అధికంగానే ఉంటుంది. 100 గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే సుమారుగా 59 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలను తింటే 97 మిల్లీగ్రాముల విటమిన్ సి ని పొందవచ్చు. వీటిల్లో విటమిన్ సి తోపాటు క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. కనుక ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి కావాలంటే క్యాప్సికమ్‌ను కూడా తినవచ్చు. 100 గ్రాముల క్యాప్సికం ద్వారా మనకు సుమారుగా 128 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. అలాగే పాలకూర, నారింజ పండ్లు, తర్బూజా వంటి పండ్లలోనూ విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. పైనాపిల్, దానిమ్మ పండ్లను సైతం తినవచ్చు. ఇలా ఈ పండ్లను చలికాలంలో ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి.