Pink Color Guava | జామ పండ్లు ప్రస్తుతం మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తున్నాయి. జామ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిల్లో రెండు రకాల పండ్లు ఉంటాయనే విషయం తెలిసిందే. తెలుపు రంగు పండ్లను మనం ఎక్కువగా చూస్తుంటాం. అలాగే పింక్ రంగులో ఉండే జామ పండ్లు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. అయితే పింక్ కలర్ జామ పండ్లను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పింక్ కలర్ జామ పండ్లలో బీటా కెరోటిన్, యాంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందుకనే అవి పింక్ రంగులో ఉంటాయి. ఈ క్రమంలోనే పింక్ రంగు జామ పండ్లను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పింక్ కలర్ జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఈ పండ్లలో పొటాషియం, పెక్టిన్ కూడా ఎక్కువగానే ఉంటాయి. 100 గ్రాముల పింక్ కలర్ జామ పండ్లను తింటే 20 శాతం ఫైబర్ లభిస్తుంది. అలాగే విటమిన్లు ఎ, బి1 (థయామిన్), బి2 (రైబో ఫ్లేవిన్), బి3 (నియాసిన్), విటమిన్ ఇ కూడా ఈ పండ్లను తినడం వల్ల మనకు లభిస్తాయి. కనుక పింక్ కలర్ జామ పండ్లను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. ఈ పండ్లను తింటే పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. పింక్ కలర్ జామ పండ్లలో ఫైబర్, పెక్టిన్ అధికంగా ఉండడం వల్ల ఈ పండ్లను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
పింక్ కలర్ జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 100 గ్రాముల జామ పండ్లను తింటే 228 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా చేస్తుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మనల్ని రోగాల బారి నుంచి రక్షిస్తుంది. పింక్ కలర్ జామ పండ్లలో బీటా కెరోటీన్, యాంథో సయనిన్స్, లైకోపీన్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. దీంతో శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. వీటి వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా అడ్డుకోవచ్చు. దీంతో చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా కనిపిస్తుంది. యవ్వనంగా మారుతారు.
పింక్ కలర్ జామ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు పింక్ కలర్ జామ పండ్లను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఈ పండ్లను తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ లో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు రోజూ ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇలా పింక్ కలర్ జామ పండ్లతో మనం అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఇవి మీకు కనిపిస్తే విడిచిపెట్టకుండా తినండి.