Pear Fruit | పండ్లంటే చాలా వరకు తియ్యగానే ఉంటాయి. అవి తియ్యగా ఉంటాయి కాబట్టే వాటిని తినేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు అంత తియ్యగా లేకున్నప్పటికీ పోషకాలను మాత్రం అధికంగా అందిస్తాయి. అలాంటి పండ్లలో బేరి పండ్లు కూడా ఒకటి. వీటినే ఆంగ్లంలో పియర్ పండ్లు అని కూడా పిలుస్తారు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బేరి పండ్లు లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటాయి. లోపల తెల్లని గుజ్జు ఉంటుంది. ఇది అంత తియ్యగా ఉండదు. కానీ బోలెడు లాభాలను మాత్రం అందిస్తుంది. ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. పలు వ్యాధులను నయం చేసేందుకు సహాయం చేస్తాయి.
పియర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ పియర్ పండును తింటే సుమారుగా 6 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు పియర్ పండ్లను తరచూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పియర్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పియర్ పండ్లలో ఉండే ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. పియర్ పండ్లు కాస్త తియ్యగానే ఉంటాయి. అయినప్పటికీ ఇవి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటాయి. అందవల్ల ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది.
పియర్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. చర్మం తన సాగే గుణాన్ని పొందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారి తేమగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. పియర్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి కనుక ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలుగా కూడా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. పియర్ పండ్లను కొందరు తొక్క తీసి తింటారు. కానీఈ పండ్లను తొక్కతో సహా తినాల్సి ఉంటుంది. పియర్ పండ్ల తొక్కలోనూ అనేక పోషకాలు ఉంటాయి. కనుక ఈ పండ్లను తొక్కతో తింటే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఇలా పియర్ పండ్లను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.