Muskmelon | వేసవి కాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని చల్లబరుచుకునే ఆహారాలను తింటారు. పానీయాలను సేవిస్తుంటారు. శరీరాన్ని చల్ల బరిచే పండ్లలో తర్బూజాలు కూడా ఒకటి. వీటిని ముక్కలుగా కట్ చేసి వాటిపై కాస్త చక్కెర లేదా తేనె వేసి తినవచ్చు. లేదా తర్బూజాలతో జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. అయితే అందరూ తర్బూజాలను కేవలం వేసవిలో మాత్రమే తింటారు. కానీ వాస్తవానికి వీటిని ఏ సీజన్లో అయినా సరే తినవచ్చు. ముఖ్యంగా ఉష్ణోగ్రత లేదా తేమ అధికంగా ఉన్నప్పుడు, ఉక్కపోత ఉన్న సమయంలో ఈ పండ్లను తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. తర్బూజాలపై చక్కెర కాకుండా తేనె వేసి తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె, చక్కెర వేయకుండా నేరుగా ఈ పండ్లను తినాలి. ఇలా తర్బూజాలను ఏ సీజన్లో తిన్నా సరే లాభాలను పొందవచ్చు.
తర్బూజా పండ్లలో 90 శాతం నీరే ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వేడి వాతావరణం ఉన్నప్పుడు ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లకుండా ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించబడతాయి. శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. శరీరం చల్లగా మారుతుంది. తర్బూజా పండ్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ ఎ వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలను తగ్గించుకోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్నవారు రోజూ ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది.
తర్బూజా పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. విటమిన్ సి వల్ల తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. తర్బూజా పండ్లను ఈ సీజన్లో తినడం వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. జ్వరం నుంచి కూడా కోలుకుంటారు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయం చేస్తాయి. కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది చర్మ సంరక్షణకు సహాయం చేస్తుంది. చర్మం తన సాగే గుణాన్ని పొందేలా చేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా మారి తేమగా ఉంటుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. యవ్వనంగా మారుతారు. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.
తర్బూజా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో చాలా మంది కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ బారిన పడుతుంటారు. కానీ తర్బూజా పండ్లను తింటే ఈ సమస్య తగ్గుతుంది. తర్బూజాలలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఇది బీపీని తగ్గించడంలో సహాయం చేస్తుంది. పొటాషియం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది. వీటిని తింటే ఫైబర్ అధికంగా లభిస్తుంది కనుక కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా తర్బూజా పండ్లను ఏ సీజన్లో తిన్నా సరే అనేక లాభాలను పొందవచ్చు.