Mulberry Fruits | సాధారణంగా చాలా మంది తమకు తెలిసిన పండ్లనే తరచూ తింటుంటారు. వాటిల్లో సీజనల్ పండ్లు కూడా ఉంటాయి. అయితే తెలియని పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా వాటి గురించి అంతగా పట్టించుకోరు. కానీ అవే అనేక లాభాలను అందిస్తాయి. అలాంటి పండ్లను తినకపోతే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారు. అలాంటి పండ్లలో మల్బెర్రీ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు చాలా చోట్ల లభిస్తున్నాయి. సూపర్ మార్కెట్లతోపాటు బయట పండ్ల దుకాణాల్లోనూ చిన్న చిన్న బాక్సుల్లో ఈ పండ్లను ఉంచి విక్రయిస్తున్నారు. ఇవి అంత తియ్యగా ఉండవు. కానీ రుచిగానే ఉంటాయి. ఈ పండ్లు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని పోషకాలకు నిలయంగా చెబుతుంటారు. ఈ పండ్లను తింటే పలు వ్యాధులను నయం చేసుకోవడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మల్బెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే రెస్వెరెట్రాల్, ఆంథో సయనిన్స్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటుంటే కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. శరీరంలోని వాపులు సైతం తగ్గిపోతాయి. మల్బెర్రీ పండ్లలో డీఎన్జే అనే ఓ సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారి రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
మల్బెర్రీ పండ్లలో ఉండే అనేక పోషకాలు హృదయ సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లను తింటుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. మల్బెర్రీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. చర్మం సురక్షితంగా ఉండేలా చూస్తుంది. మల్బెర్రీ పండ్లలో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయ పడుతుంది. దీని వల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
మల్బెర్రీ పండ్లలో విటమిన్లు కె, ఇ సైతం అధికంగా ఉంటాయి. విటమిన్ కె వల్ల గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకడుతుంది. దీంతో రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. మల్బెర్రీ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మల్బెర్రీ పండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటుంటే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందవు. దీనిపై సైంటిస్టులు అధ్యయనాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా మల్బెర్రీ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు, కనుక ఇకపై మీకు ఈ పండ్లు కనిపిస్తే విడిచిపెట్టకుండా కొని తెచ్చుకుని తినండి.