Long Beans | మనకు అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చిన లేదా తమకు అందుబాటులో ఉన్న కూరగాయలు లేదా ఆకుకూరలను వండుకుని తింటుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలను మాత్రం చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ అలాంటి కూరగాయలు అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటాయి. అలాంటి కూరగాయల్లో అలసందలు కూడా ఒకటి. ఇవి బీన్స్ జాతికి చెందినవి. కానీ బీన్స్ కన్నా కాస్త మృదువుగా ఉంటాయి. తేలిగ్గా ఉడుకుతాయి. త్వరగా జీర్ణం అవుతాయి. అలసంద కాయలతో అనేక రకాల వంటలను చేస్తుంటారు. వీటితో వేపుడు లేదా టమటా కూర చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే అలసందలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి.
అలసందల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలసందల్లో ఉండే ఫైబర్ కారణంగా బరువు తగ్గడం తేలికవుతుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు వీటిని రోజూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. షుగర్ ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాయలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. అందువల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కాయలను తింటే అధిక మొత్తంలో విటమిన్ సి ని పొందవచ్చు. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. గాయాలు, పుండ్లు త్వరగా నయమవుతాయి.
అలసందల్లో విటమిన్ బి9 (ఫోలేట్) అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండేలా చేస్తుంది. శిశువుల్లో పుట్టుక లోపాలు రాకుండా అడ్డుకుంటుంది. శిశువుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలసందల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరును క్రమబద్దీకరిస్తుంది. దీని వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతాన లోపం సమస్య తగ్గుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అలసందల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీని వల్ల రక్తహీనత తగ్గుతుంది. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సైతం పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది.
అలసందల్లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు సహాయం చేస్తాయి. శరీరానికి శక్తి అందేలా చూస్తాయి. ఈ కాయల్లో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా అలసందలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. వీటిని జ్యూస్‌లా తయారు చేసి తాగవచ్చు. లేదా సలాడ్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఇతర కూరగాయలు, పండ్లతోనూ కలిపి తినవచ్చు. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.