Karonda Fruits | మార్కెట్లో లేదా బయట బండ్లపై మనకు అప్పుడప్పుడు పలు చిత్రమైన పండ్లు దర్శనమిస్తుంటాయి. అలాంటి పండ్లు ఉంటాయని కూడా చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో వాక్కాయలు కూడా ఒకటి. వీటినే కరోండా పండ్లని కూడా పిలుస్తారు. ఇవి పులుపు, తీపి రుచుల్లో ఉంటాయి. మార్కెట్లో ఈ పండ్లను చాలా మంది చూసే ఉంటారు, కానీ ఇవే వాక్కాయలని చాలా మందికి తెలియదు. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు కొందరు ఊరగాయ పచ్చడి కూడా పెడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి వాక్కాయలు అంటే బాగా పరిచయం ఉంటుంది. అయితే ఈ కాయలు పండ్లుగా మారినప్పుడు తినాలి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాక్కాయలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కాయలను తింటే పలు వ్యాధులు కూడా నయమవుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
వాక్కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్ ఎ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఈ కాయల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు సహాయం అందిస్తాయి. ఈ కాయలను తినడం వల్ల ఎముకలు పటిష్టంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు నిర్మాణమవుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
వాక్కాయల్లో ఉండే విటమిన్ సి మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. తరచూ ఈ కాయలను తింటుంటే సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో సుఖ విరేచనం అవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కాయలను తింటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ కాయలు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తింటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాక్కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఈ కాయల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు ఈ కాయలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. షుగర్ ఉన్నవారికి కూడా ఇవి మేలు చేస్తాయి. వీటిని తింటే ఇన్సులిన్ ను శరీరం మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి కూడా వాక్కాయలు మేలు చేస్తాయి. ఈ కాయలను తింటుంటే శరీరానికి మెగ్నిషియం లభిస్తుంది. ట్రిప్టోఫాన్ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది సెరొటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా వాక్కాయలను తరచూ తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.