Green Beans | గ్రీన్ బీన్స్.. వీటినే స్నాప్ బీన్స్ అని, స్ట్రింగ్ బీన్స్ అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వీటిని కేవలం బీన్స్ అని అంటారు. ఇవి మనకు మార్కెట్లో ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. బీన్స్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు ఎక్కువగా ఉపయోగిస్తారు. బీన్స్‌తో కొందరు వేపుడు, కూర వంటివి చేస్తుంటారు. అయితే ఇవి అంతగా రుచిగా ఉండని కారణంగా చాలా మంది బీన్స్‌ను తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ వీటిల్లో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం ఇకపై బీన్స్‌ను విడిచిపెట్టకుండా తింటారు. బీన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే అనేక లాభాలు కలుగుతాయని, పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని అంటున్నారు. బీన్స్‌ను తప్పనిసరిగా తినాలని సూచిస్తున్నారు.
గ్రీన్ బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు గ్రీన్ బీన్స్‌ను తింటే సుమారుగా 2 నుంచి 4 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది పేగుల్లో మలం సులభంగా కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. గ్రీన్ బీన్స్‌ను తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. శరీరానికి పోషకాలు సక్రమంగా లభిస్తాయి. గ్రీన్ బీన్స్‌ను గుండెను ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గ్రీన్ బీన్స్ లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే ఫోలేట్, పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి బీన్స్ ఎంతగానో మేలు చేస్తాయి.
వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడంతోపాటు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి రక్త నాళాలు వాపులకు గురికాకుండా రక్షిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీన్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తరచూ బీన్స్‌ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. గ్రీన్ బీన్స్‌లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలు విరిగిపోకుండా, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
గ్రీన్ బీన్స్‌లో అధికంగా ఉండే విటమిన్ సి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బీన్స్‌లో విటమిన్ ఎ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. బీన్స్‌లో ఉండే ఫోలేట్ గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. బీన్స్‌లో ఉండే మాంగనీస్ మెటబాలిజంను మెరుగు పరిచి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీన్స్‌లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా లభిస్తుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. ఇలా బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఇకపై మీకు బీన్స్ కనిపిస్తే ఇంటికి తెచ్చుకుని తినడం మరిచిపోకండి.