Cranberries | మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో క్రాన్ బెర్రీలు కూడా ఒకటి. చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు మనకు దర్శనమిస్తాయి. అయితే మార్కెట్లో ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా లభించినా చాలా మంది ఈ పండ్లను అంతగా తినరు. ధర ఎక్కువ ఉంటాయన్న కారణం చేత ఈ పండ్లను చాలా మంది తినరు. కానీ క్రాన్బెర్రీలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పండ్లను తింటే అనేక పోషకాలను పొందవచ్చు. మనకు కలిగే పలు వ్యాధులను నయం చేయడంలో క్రాన్ బెర్రీలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఒక కప్పు క్రాన్ బెర్రీలను తింటే సుమారుగా 46 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లలో 87 శాతం నీరే ఉంటుంది. 12 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ఫైబర్, 0.4 గ్రాముల ప్రోటీన్లు, 0.1 గ్రాము కొవ్వు ఉంటాయి. అలాగే విటమిన్లు సి, కె1, ఇ, బి1, బి2, బి3, బి6, మాంగనీస్, కాపర్, పొటాషియం, ఐరన్ తదితర పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి.
మూత్రాశయ సమస్యలు ఉన్నవారికి క్రాన్ బెర్రీలు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. క్రాన్ బెర్రీలను తినడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. క్రాన్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సైతం నియంత్రణలో ఉంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
క్రాన్ బెర్రీలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణాశయం, పేగుల క్యాన్సన్ రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఉండే పురుగులు, ఇతర సూక్ష్మ క్రిములు సైతం నశిస్తాయి. క్రాన్ బెర్రీలలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఈ పండ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. క్రాన్ బెర్రీలను తినడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
క్రాన్ బెర్రీలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పండ్లను తింటే మెటబాలిక్ ప్రక్రియ మెరుగు పడుతుంది. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. క్రాన్ బెర్రీలను రోజుకు ఒక కప్పు మోతాదులో తినవచ్చు. వీటి జ్యూస్ అయితే రోజుకు 200 ఎంఎల్ మోతాదులో తాగాల్సి ఉంటుంది. మార్కెట్లో మనకు క్రాన్ బ్రెర్రీలు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉంటున్నాయి. కనుక ఈ పండ్లను అయినా సరే తినవచ్చు. ఇలా క్రాన్ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.