Health Care | సాధారణంగా మనం ఏవైనాపెద్ద అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా తలెత్తుతాయని భావిస్తూ ఉంటాం. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పులే మన శరీరాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. మనం ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు, మనం పాటించే దినచర్య, మన అలవాట్లు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని నెమ్మదిగా తీస్తాయి. ఈ అలవాట్లు మనకు హాని కలిగించనివిగా కనిపించినప్పటికీ దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తాయి. కాలక్రమేణా అవి హృదయ ఆరోగ్యాన్ని, శక్తిని, స్థితిస్థాపకతను దెబ్బతీస్తాయి. మన రోజువారీ అలవాట్లు మన గుండె ఆరోగ్యాన్ని, మన మొత్తం శరీర ఆరోగ్యాన్ని నెమ్మదిగా ఎలా దెబ్బతీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం పని చేస్తూనే ఉంటారు. విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది.
అంతేకాకుండా బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు తలెత్తడంతో పాటు వీటి నుండి కోలుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అలాగే మారిన జీవనశైలిలో భాగంగా మనలో చాలా మంది కూర్చొని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది వెన్నెముకతో మన జీవక్రియలను కూడా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా మనలో చాలా మంది ఒత్తిడికి గురి అవుతున్నారు. అసలు దీనిని ఒక సమస్యగా కూడా చూడడం లేదు. కానీ ఒత్తిడిని విస్మరించడం వల్ల కొంతకాలం తరువాత ఛాతిలో నొప్పి, కడుపు నొప్పి, భయాందోళనలు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి అన్నీ కూడా గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఉరుకుల పరుగుల జీవితాల కారణంగా మనలో చాలా మంది ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తున్నారు.
శక్తి కోసం చక్కెరలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి అనే భావనతో నచ్చిన ఆహారాన్ని ఏదో ఒకటి తీసుకుంటున్నారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతున్నాయి. శరీరానికి పోషకాలు కూడా సరిగ్గా అందవు. ఫలితంగా పోషకాహార లోపంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అల్పాహారాన్ని దాటి వేయడం వల్ల మన శరీరం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే మన శరీర అవసరాలను నిర్లక్ష్యం చేసి ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన భావోద్వేగ, శారీరక నిల్వలు తగ్గిపోతాయి. కనుక మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని మన ఆరోగ్యంపై శ్రద్ద వహించడం కూడా చాలా అవసరం.
ఇలా మన అలవాట్లు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక మనం వయసులో ఉన్నప్పుడే మన అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా వయసు పైబడిన తరువాత అనేక రకాల చికిత్సలతో పాటు మందులు మింగాల్సి వస్తుంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మనం కోలుకోలేకుండా ఇతరులపై ఆధారపడేలా చేస్తాయి. కనుక మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఒక సరైన ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు.