Almonds | ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటే శరీరానికి కావల్సిన అన్ని పోషషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే పౌష్టికాహారాల విషయానికి వస్తే వాటిల్లో బాదంపప్పు ముందు వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. దీన్ని రోజూ తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే బాదంపప్పును పొట్టు తీసి తినాలని కొందరు అంటారు. పొట్టుతోనే తినాలని మరికొందరు సూచిస్తారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది..? అసలు బాదంపప్పును పొట్టుతో తినాలా, పొట్టు తీసి తినాలా..? నీటిలో నానబెట్టి తింటే ఏం జరుగుతుంది..? వంటి విషయాలకు గాను నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. ఇక ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పు పొట్టులో టానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటాయి. కనుక బాదంపప్పును పొట్టు తీసి తినాల్సి ఉంటుంది. అలాగే బాదంపప్పు పొట్టులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నిషియం వంటి మినరల్స్‌కు అతుక్కుంటుంది. మనం తిన్న ఆహారంలో ఈ పోషకాలు ఉంటే వాటిని శరీరానికి అందకుండా అడ్డుకుంటుంది. కనుక ఈ కారణం వల్ల కూడా బాదంపప్పును పొట్టు తీసేసి తినాల్సి ఉంటుంది. అలాగే బాదంపప్పు పొట్టులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొందరికి సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణ సమస్యలను సృష్టిస్తుంది. గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక బాదంపప్పును పొట్టు తీసి తింటే మంచిది. ఆయుర్వేద కూడా బాదంపప్పును పొట్టు తీసే తినాలని చెబుతోంది. బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తింటే ఇంకా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
అయితే బాదంపప్పు పొట్టులోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఈ పొట్టులో ఫైబర్‌తోపాటు పాలిఫినాల్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. పొట్టు తీసేసి తింటే ఈ పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. కనుక బాదంపప్పును పొట్టుతో తినవచ్చు. ఇందులో సందేహించాల్సిన పనిలేదు. బాదంపప్పు పొట్టు వల్ల మనకు ఎలాంటి హాని కలగదు. కానీ అజీర్తి ఉన్నవారు, పోషకాహార లోపం సమస్యలు ఉన్నవారు మాత్రం బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల సులభంగా జీర్ణం అవడంతోపాటు కావల్సిన పోషకాలు లభిస్తాయి. ఇలా బాదంపప్పును ఎవరి సౌకర్యానికి తగినట్లు వారు తినవచ్చు. ఇక బాదంపప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
నానబెట్టి పొట్టు తీసిన బాదంపప్పును తింటే తేలిగ్గా జీర్ణమవుతుంది. మన శరీరానికి కావల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు సులభంగా లభిస్తాయి. బాదంపప్పును తినడం వల్ల విటమిన్ ఇ, రైబోఫ్లేవిన్, ఎల్-కార్నైటైన్ అనే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు యాక్టివ్‌గా మారేలా చేస్తాయి. బాదంపప్పులో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం మన శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పప్పును తింటుంటే బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే శిరోజాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇలా బాదంపప్పుతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.