Castor Oil | పూర్వకాలంలో మన పెద్దలు ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఆముదంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. మన పెద్దలు ఆముదాన్ని వాడేవారు కనుక వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఆముదాన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే ఆముదాన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులో రాత్రి పూట తీసుకోవాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆముదాన్ని తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని అంటున్నారు. ఆముదం తాగితే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకానికి ఆముదం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణ సమస్యలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఆముదంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని కాస్త వేడి చేసి రాయడం వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్, కండరాల నొప్పులు, స్త్రీలకు వచ్చే రుతు సమయ నొప్పులను తగ్గించడంలో ఆముదం చక్కగా పనిచేస్తుంది. దీన్ని కాస్త వేడి చేసి రాస్తే చాలు ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆముదంలో ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఆముదం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి కావల్సిన తేమను సహజసిద్ధంగా అందిస్తుంది. దీని వల్ల పొడి చర్మం ఉన్నవారికి మేలు జరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా కనిపిస్తుంది. యవ్వనంగా ఉంటారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు సైతం తగ్గిపోతాయి. పగిలిన చర్మం లేదా పెదవులపై రాస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
ఆముదం జుట్టుకు కూడా సంరక్షణను అందిస్తుంది. ఆముదాన్ని తరచూ జుట్టుకు బాగా పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే శిరోజాలు రాలిపోవడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు నల్లగా మారుతాయి. ప్రకాశిస్తాయి. గాయాలు, పుండ్లను మానేలా చేయడంలోనూ ఆముదం పనిచేస్తుంది. ఆముదంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని రాస్తుంటే చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. చర్మంపై వచ్చే వాపులు తగ్గిపోతాయి. ఆముదంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆముదాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. దీన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇలా చేస్తుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
12 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు ఆముదాన్ని రోజుకు 15 ఎంఎల్ మోతాదులోనే తాగాలి. లేదా 1 టేబుల్ స్పూన్ వరకు తాగవచ్చు. పిల్లలకు పావు టీస్పూన్ మోతాదులో ఆముదాన్ని తాగించవచ్చు. దీని వాసన కారణంగా కొందరికి పొట్టలో తిప్పినట్లు అనిపిస్తుంది. వికారంగా, వాంతికి వచ్చినట్లు ఉంటుంది. అలాంటి వారు ఆముదాన్ని ఏదైనా జ్యూస్లో కలిపి తీసుకోవచ్చు. ఆముదాన్ని మోతాదుకు మించి తాగితే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు సమస్య తగ్గే వరకు మాత్రమే ఆముదాన్ని ఉపయోగించాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఆముదాన్ని తాగాల్సి ఉంటుంది. దీంతో మరింత మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు.