స్త్రీలకు పీరియడ్స్ అధికంగా ఉండి, రెండు మూడు గంటలకోసారి ప్యాడ్లు మార్చాల్సి వస్తుంటే అది అసాధారణమైన పరిస్థితి. దాని గురించి ఆలోచించాల్సిందే. శృంగారంలో పాల్గొన్న తర్వాత, మెనోపాజ్ తర్వాత, మెన్స్ట్రువల్ పీరియడ్స్ మధ్యలో, మెనోపాజల్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తర్వాత కూడా స్పాటింగ్ ఏర్పడుతున్నా వైద్యులను సంప్రదించాల్సిందే.
స్పాటింగ్, హెవీ పీరియడ్స్ వివిధ సమస్యలకు సంకేతాలు. ఫైబ్రాయిడ్స్, గడ్డలు, ఎండోమెట్రోసిస్, ఎండోమెట్రియల్ అట్రఫీ, హైపర్‌ప్లేసియా, క్యాన్సర్ లాంటి వాటికి సంకేతాలని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, యోని కండరాల్లో అభివృద్ధి చెందే హానికరం కాని కురుపులే ఫైబ్రాయిడ్స్. ఇవి సుదీర్ఘమైన, హెవీ పీరియడ్స్‌కు కారణమవుతాయి. లేదంటే నాన్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్‌కు దారితీస్తాయి. వంధ్యత్వం కూడా సంభవించవచ్చు.
యోని గోడ (ఎండోమెట్రియం)లపై అభివృద్ధి చెందే కణుతులు పాలిప్స్. వీటి కారణంగా క్రమరహితంగా, లేదా ఎక్కువగా, ఇంకా శృంగారం తర్వాత విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. సాధారణంగా పాలిప్స్ కూడా హానికరం కాని గడ్డలే. అయితే పాథాలజీ ప్రయోగశాలలో పరీక్ష చేయించుకుంటే మంచిది.
యోనికి బాహ్యంగా యోని లైనింగ్ లాంటి కండరం పుట్టుకొస్తే దానిని ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల కూడా పీరియడ్స్ అతిగా అవుతాయి. స్పాటింగ్ ఏర్పడుతుంది. ఇక ఈస్ట్రోజెన్ స్థాయులు తక్కువగా ఉంటే ఎండోమెట్రియల్ అట్రఫీ వస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయులు అధికంగా ఉండటం వల్ల యోని మందంగా మారడాన్ని హైపర్‌ప్లేసియా అంటారు.
ఇది కొంతకాలానికి ఎండోమెట్రియల్ క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. క్రమరహితంగా రక్తస్రావం జరగడం, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం జరగడం ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు సంకేతాలు. తొలిదశలోనే వీటిని గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుంది.
ఎవరిని కలవాలి? అబ్‌స్టెట్రీషియన్- గైనకాలజిస్ట్
పరీక్షలు: ట్రాన్స్‌వెజినల్ అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ.