Wall Squats | శరీర ఆరోగ్యాన్ని, బలాన్ని పెంచడానికి మనం అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేయదగిన వ్యాయామాల్లో వాల్ స్క్వాట్స్ కూడాఒకటి. వీటిని వాల్ సిట్స్, గోడ కుర్చీ అని కూడా పిలుస్తారు. వీపును గోడకు ఆనించి, స్క్వాట్ పొజిషన్లోకి వంచి బాల్ ను కొంత సమయం పాటు పట్టుకుని చేసే ఈ వ్యాయామాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్, కోర్ కండరాలను బలంగా చేస్తాయి. ఈ వ్యాయామం చేయడం వల్ల ఓర్పు, స్థిరత్వం కూడా పెరుగుతుంది. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా చేసే ఈ వ్యాయామాల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే ఈ వాల్ స్క్వాట్స్ ను ఎలా చేయాలి.. అన్న విషయాలను ఫిట్ నెస్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల దిగువ శరీర భాగంలో ఉండే కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో చలనశీలత, స్థిరత్వం పెరుగుతుంది. నడక, మెట్లు ఎక్కడం వంటి రోజువారి కదలికలను సులభంగా చేయవచ్చు. వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల ఉదర, నడుము కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో వెన్నెముక స్థిరత్వం పెరుగుతుంది. వెన్నునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల శరీర దిగువ భాగంలో ఉండే కండరాల ఓర్పు, స్థిరత్వం పెరుగుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో ఆటలు, శారీరక కార్యకలాపాలకు కావల్సిన శక్తి మెరుగుపడుతుంది. మనలో చాలా మంది నిటారుగా కూర్చోలేక, నిలబడ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల వెన్నెముక అమరిక సరిగ్గా ఉంటుంది. కాలక్రమేణా వంగడం తగ్గుతుంది. వెన్నునొప్పి కూడా తగ్గుతుంది.
ఈ స్క్వాట్స్ చేయడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. కొవ్వు వేగంగా కరుగుతుంది. కనుక శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ వ్యాయామం కదలకుండా చేసే వ్యాయామం కనుక కీళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడదు. కనుక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు శరీర బలాన్ని పెంచుకోవడానికి ఈ వ్యాయామం ఎంతో సహాయపడుతుంది.
ముందుగా గోడకు 1 లేదా 2 అడుగుల దూరంలో నిలబడి వీపును గోడకు ఆనించాలి. తరువాత కాళ్లను కొద్దిగా వెడల్పుగా చేసి నేలపై పూర్తిగా ఉంచాలి. తొడలు నేలకు సమాంతరంగా ఉంటూ గోడపై నుండి నెమ్మదిగా కిందికి జారాలి. దీంతో మోకాళ్ల వద్ద 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఇప్పుడు 20 నుండి 30 సెకన్ల పాటు అలాగే ఉండి స్క్వాట్ ను పట్టుకోవాలి. కండరాల బలం పెరిగే కొద్ది క్రమంగా వ్యవధిని పెంచాలి. తరువాత నెమ్మదిగా కాళ్లను దగ్గరికి చేసి నిలబడాలి. కండరాల బలం పెరిగే కొద్దీ వ్యవధిని పెంచడంతోపాటు 3 నుండి 4 స్క్వాట్స్ చేయాలి. ఈ వాల్ స్క్వాట్స్ ను దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.