Walking After Dinner | ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అందరూ ఏ పని చేసినా చాలా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం వంటి విషయాల్లో మాత్రం నెమ్మదిగానే ఉంటున్నారు. ముఖ్యంగా రాత్రి పూట భోజనాన్ని చాలా ఆలస్యంగా తింటున్నారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది. ఇక తిన్న వెంటనే నిద్రిస్తున్నారు. ఇది తీవ్రమైన వ్యాధులను కలగజేస్తోంది. అయితే రాత్రి పూట భోజనం చేసిన తరువాత కనీసం 10 నిమిషాల పాటు అయినా తేలికపాటి వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి డిన్నర్ అనంతరం ఇలా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.
రాత్రి పూట భోజనం అనంతరం వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇలా రాత్రి పూట భోజనం అనంతరం వాకింగ్ చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. రాత్రి పూట భోజనం చేసిన తరువాత కనీసం 2 నుంచి 5 నిమిషాలు వాకింగ్ చేయాలని, వీలుంటే 10 నుంచి 15 నిమిషాల వరకు వాకింగ్ చేస్తే ఇంకా మంచిదని వారు చెబుతున్నారు. దీని వల్ల మరుసటి రోజు ఉదయం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అది అదుపులో ఉండేందుకు, లేని వారు అది రాకుండా ఉండేందుకు రాత్రి డిన్నర్ అనంతరం వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట భోజనం చేశాక తేలికపాటి వాకింగ్ చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అజీర్తి ఉన్నవారు రోజూ ఇలా చేస్తే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమవడమే కాదు, గ్యాస్ మొత్తం పోతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం, అసిడిటీ తగ్గిపోతాయి. పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. విరేచనం సాఫీగా అవుతుంది. రాత్రి పూట భోజనం అనంతరం వాకింగ్ చేసే వారిలో గుండె ఆరోగ్యం మెరుగు పడినట్లు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. దీని వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. తద్వారా రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు రాత్రి భోజనం చేశాక వాకింగ్ చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. రాత్రి మనం నిద్రపోయినా కూడా శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది., బరువు తగ్గాలనే ప్లాన్లో ఉన్నవారు రాత్రి పూట వాకింగ్ చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పూట వాకింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. ఇలా రాత్రి పూట వాకింగ్ వల్ల అనేక లాభాలు పొందవచ్చు.