Vitamin C Deficiency Symptoms | మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్ సి కూడా ఒకటి. ఇది శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. విటమిన్ సి నీటిలో కరిగే పోషక పదార్థం. కనుక ఈ విటమిన్‌ను మనం రోజూ తీసుకోవాలి. శరీరం దీన్ని నిల్వ చేసుకోలేదు. శరీరంలో అధికంగా ఉండే విటమిన్ సి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి విటమిన్ సి మనకు రోజూ కావల్సిందే. అయితే విటమిన్ సి లోపిస్తే మనకు అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా శరీరం పలు సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని పరిశీలించడం ద్వారా మనలో విటమిన్ సి లోపం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. దీంతో విటమిన్ సి కోసం డాక్టర్లు సూచించే విధంగా మందులను వాడడంతోపాటు ఈ విటమిన్ ఉండే ఆహారాలను తింటుంటే విటమిన్ సి లోపం నుంచి బయట పడవచ్చు.
విటమిన్ సి లోపం ఉంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీంతో గాయాలు, పుండ్లు మానడం ఆలస్యమవుతుంది. రక్తనాళాలు దృఢత్వాన్ని కోల్పోతాయి. శరీరంలోని శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. విటమిన్ సి లోపం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీని వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో ఎముకలు సులభంగా విరిగిపోతాయి. త్వరగా అతుక్కోవు కూడా. విటమిన్ సి లోపం ఉంటే శరీరం కొల్లాజెన్‌ను కూడా ఉత్పత్తి చేసుకోలేదు. దీంతో కండరాల పనితీరు మందగిస్తుంది. కండరాల వాపులు, నొప్పులు వస్తుంటాయి. అలాగే చర్మం ముడతలు పడుతుంటుంది. చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చిన్న పని చేసినా అలసిపోతారు. నీరసం వచ్చినట్లు అనిపిస్తుంది.
విటమిన్ సి లోపిస్తే మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను కూడా శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీంతో రక్తం తయారుకాదు. దీర్ఘకాలంలో ఇది రక్తహీనతకు దారి తీస్తుంది. కాబట్టి రక్తం తయారు కావాలంటే విటమిన్ సి కూడా అవసరమే. విటమిన్ సి లోపిస్తే రక్తనాళాల గోడలు సులభంగా డ్యామేజ్ అవుతుంటాయి. అలాగే చర్మం సులభంగా కందిపోతుంది. తరచూ చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. విటమిన్ సి లోపం ఉంటే జుట్టుపై కూడా ప్రభావం పడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది కనుక జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతుంది. అలాగే గోళ్లు కూడా బలహీనంగా మారి విరిగిపోతాయి. చర్మం, జుట్టు పొడిగా మారుతాయి. జీవం లేనట్లు కనిపిస్తాయి.
విటమిన్ సి లోపం ఉంటే రక్తనాళాల గోడలు పలుచగా మారుతాయి. దీంతో వాపులకు గురవుతాయి. ఫలితంగా చిగుళ్ల ఉండే రక్త నాళాలు పగిలిపోతాయి. అక్కడి నుంచి రక్త స్రావం జరుగుతుంది. నోటి దుర్వాసన వస్తుంది. నోట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. దీంతో దీర్ఘకాలంలో ఇది న్యుమోనియాకు దారి తీసే చాన్స్ ఉంటుంది. విటమిన్ సి లోపిస్తే కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడుతాయి. కంటి చూపు మందగిస్తుంది. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. అవసరం అయితే మందులను వాడడంతోపాటు విటమిన్ సి ఉండే ఆహారాలను తింటుండాలి. దీంతో ఈ లోపం నుంచి బయట పడవచ్చు.