Vegetarian Vitamin D Foods | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. అయితే నీటిలో కరిగే పోషకాలను రోజూ తీసుకోవాలి. కానీ కొవ్వులో కరిగే విటమిన్లను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తీసుకుంటే చాలు. అలాంటి విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది కొవ్వులో కరుగుతుంది. కనుక ఈ విటమిన్ ను రోజూ తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్ డి మన శరీరానికి తగినంతగా లభిస్తే శరీరం ఈ విటమిన్ను నిల్వ చేసుకుంటుంది. తరువాత అవసరాల కోసం ఉపయోగించుకుంటుంది. అయితే విటమిన్ డి మనకు ఎలా లభిస్తుందో అందరికీ తెలిసిందే. దీన్ని మనం సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. రోజూ ఉదయం కాసేపు సూర్య రశ్మిలో శరీరం తగిలేలా ఉంటే దాంతో మన చర్మం కింది భాగంలో విటమిన్ డి తయారవుతుంది. కనుకనే డాక్టర్లు సైతం రోజూ కాసేపు ఎండలో నిలబడాలని చెబుతుంటారు. అయితే విటమిన్ డి మనకు పలు వెజిటేరియన్ ఆహారాల్లోనూ లభిస్తుంది.
విటమిన్ డి మన శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే వెజిటేరియన్లు విటమిన్ డి అంటే కేవలం మాంసాహారంలోనే ఉంటుందని అనుకుంటారు. అలా భావిస్తే పొరపాటు పడినట్లే. ఎందుకంటే విటమిన్ డి పలు వెజ్ ఆహారాల్లోనూ లభిస్తుంది. మనలో చాలా మంది పుట్టగొడుగులను ఎంతో ఇష్టంగా తింటారు. ఒకప్పుడు కేవలం వర్షాకాలం సీజన్లోనే ఇవి లభించేవి. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్ట గొడుగులను తినవచ్చు. పుట్టగొడుగులను విటమిన్ డికి చక్కని నెలవుగా చెప్పవచ్చు. యూఎస్డీఏ చెబుతున్న ప్రకారం 100 గ్రాముల పుట్టగొడుగులను తినడం ద్వారా 7ఐయూ విటమిన్ డి లభిస్తుంది. అందువల్ల పుట్ట గొడుగులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
మార్కెట్లో మనకు లభించే బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ కొన్నింటిలోనూ విటమిన్ డి ఉంటుంది. అలాగే వీటిని తింటే పలు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. అయితే పోషకాహార నిపుణుల సూచన ప్రకారం వీటిని తింటే ఎంతో మేలు పొందవచ్చు. అదేవిధంగా చాలా మంది పెరుగును కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే పెరుగులోనూ విటమిన్ డి ఉంటుంది. పెరుగును రోజువారి ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. దీంతో విటమిన్ డిని పొందవచ్చు. అలాగే సోయాపాలతో తయారు చేసే తోఫులోనూ విటమిన్ డి సమృద్ధిగానే లభిస్తుంది. తోఫును కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
నారింజ పండ్లలో కేవలం విటమిన్ సి మాత్రమే ఉంటుందని భావిస్తారు. కానీ ఈ పండ్లలో విటమిన్ డి కూడా సమృద్ధిగానే ఉంటుంది. కనుక నారింజ పండ్లను తరచూ తింటుండాలి. రోజుకు ఒక నారింజ పండును తింటే విటమిన్ డిని సమృద్ధిగా పొందవచ్చు. అలాగే పాలు, పాల సంబంధ పదార్థాల్లోనూ విటమిన్ డి సమృద్ధిగానే ఉంటుంది. ముఖ్యంగా పాలు, పెరుగు, చీజ్, నెయ్యి తదితర ఆహారాల్లో మనకు విటమిన్ డి లభిస్తుంది. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్ డిని పొందవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. కేవలం నాన్వెజ్ ఆహారాలనే కాదు, ఈ వెజ్ ఆహారాల ద్వారా కూడా విటమిన్ డిని పొందవచ్చు.