Vegetarian Protein Foods | మాంసాహారం తినేవారికి ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయన్న విషయం తెలిసిందే. ప్రోటీన్ల వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. కండరాలకు మరమ్మత్తులు కూడా నిర్వహించబడతాయి. దేహానికి దృఢత్వం లభిస్తుంది. అయితే శాకాహారులు ప్రోటీన్ల కోసం ఏయే ఆహారాలను తినాలా అని ఆలోచిస్తుంటారు. ఏయే ఆహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయో చాలా మందికి తెలియదు. వాస్తవానికి జంతు సంబంధ ప్రోటీన్ల కన్నా వృక్ష సంబంధ ప్రోటీన్లు మనకు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే వృక్ష సంబంధ ప్రోటీన్లు కావాలంటే శాకాహారులు అందుకు పలు ఆహారాలను తరచూ తినాల్సి ఉంటుంది. ఆ ఆహారాలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పప్పు దినుసులను వృక్ష సంబంధ ప్రోటీన్లకు చక్కని వనరుగా చెప్పవచ్చు. కందిపప్పు, పెసర పప్పు లేదా పెసలు, మినుములు, శనగలు, బీన్స్, చిక్కుడు జాతి గింజలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పప్పు దినుసులను ఒక కప్పు మేర ఉడికించి తింటే సుమారుగా 18 గ్రామేల మేర ప్రోటీన్లను పొందవచ్చు. శనగల్లో అయితే 15 గ్రాముల వరకు ప్రోటీన్లు లభిస్తాయి. పప్పు దినుసులు, శనగలను తినడం వల్ల ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సైతం నియంత్రణలో ఉంచుతుంది. పప్పు దినుసులు, శనగల్లో ఐరన్, ఫోలేట్, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి లభించేలా చేస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి.
సోయా టోఫులోనూ వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల టోఫును తింటే సుమారుగా 8 నుంచి 15 గ్రాముల ప్రోటీన్లను పొందవచ్చు. దీన్ని సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారు. కనుక వృక్ష సంబంధ ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. ఇందులో మన శరీరానికి కావల్సిన 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. టోఫులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వివిధ రకాల గింజలు, విత్తనాల్లోనూ వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలను తినవచ్చు. బాదంపప్పును గుప్పెడు తింటే సుమారుగా 7 గ్రాముల ప్రోటీన్లను పొందవచ్చు. గుమ్మడికాయ విత్తనాలను తింటే 10 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
కినోవాను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా వృక్ష సంబంధ ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. ఒక కప్పు ఉడకబెట్టిన కినోవాలో సుమారుగా 8 గ్రాముల మేర ప్రోటీన్లు ఉంటాయి. కినోవాను ఆహారంలో భాగం చేసుకుంటే పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కినోవాను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. సెలబ్రిటీలు చాలా మంది దీన్నే తింటారు. ఇది బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. అయితే శాకాహారులు జంతు సంబంధ ప్రోటీన్లు వద్దని అనుకుంటే పైన తెలిపిన వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినవచ్చు. అయితే కొందరు చికెన్, మటన్ లాంటివి తినకపోయినా పాలు, పెరుగు, పనీర్ వంటివి తింటారు. ఇవి నాన్ వెజ్ ఆహారాలు కావు. కనుక శాకాహారులు ప్రోటీన్ల కోసం వీటిని కూడా తీసుకోవచ్చు. ఇలా ఆయా ఆహారాలను తింటుంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.