Karnataka : కర్ణాటకలో ఘోర విషాధం జరిగింది. నదిలో ముత్యపు చిప్పల కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందినఎనిమిది మంది మరణించారు. ఇంకో ఇద్దరు గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక, ఉత్తర కన్నడ జిల్లా, భట్కాల్ తాలూకా, షిరాలి గ్రామ సమీపంలోని తట్టే హక్కాలు నదిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టే హక్కాలు అనే మంచినీటి నదిలోకి 14 మంది సభ్యుల బృందం ఆదివారం ముత్యాల చిప్పల కోసం వెళ్లింది.
ఈ సీజన్లో ఇక్కడ ముత్యపు చిప్పలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని సేకరించేందుకు స్థానికులు చాలా మంది నదిలోకి వెళ్తుంటారు. బాధితులు నదిలోకి వెళ్లి ముత్యాల కోసం వెతికే సమయానికి నీటి ప్రవాహం తక్కువగా ఉంది. అయితే, ఉన్నట్లుండి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వేగంగా అలలు వీచాయి. పెరిగిన నీటి ప్రవాహం, అలల ధాటికి ఒక్కొక్కరు కొట్టుకుపోయారు. ఇది గమనించిన మిగతావారు సాయం చేయడానికి ప్రయత్నించారు. నదిలోపలికి వెళ్లి వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించగా, వారిలో ఇంకొందరు కూడా కొట్టుకుపోయారు. నీటి లోతును, వేగాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల కొందరు, ఇతరుల్ని రక్షించేందుకు ప్రయత్నించి మరికొందరు నీటిలో గల్లంతయ్యారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, రక్షక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎనిమిది మృతదేహాల్ని గుర్తించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో వర్షం పడటం వల్ల నీటి ప్రవాహం పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బాధితుల్లో ఎంతమందికి ఈత వచ్చు అనే విషయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.