Vijay Joseph : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ఇప్పుడు పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించారా..? ముందుగా కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? తన పార్టీ టీవీకే విస్తరణలో భాగంగా ఆయన త్వరలో జరగబోయే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (BBMP) ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ తమిళనాడులోని టీవీకే వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. కర్ణాటకలో పార్టీ జెండా పాతాలని విజయ్ గట్టి సంకల్పంతో ఉన్నట్లు ఆయన పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఐటీ హబ్ అయిన బెంగళూరు నగరంలో స్థానిక కన్నడిగులతో పాటు లక్షలాది మంది తమిళ ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్నారు. అంతేకాకుండా నటుడిగా విజయ్‌కి కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో భారీ సంఖ్యలో అభిమాన సంఘాలు, బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయాన్ని బెంగళూరులోని విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సానుకూలతలను ఓట్లుగా మార్చుకుని, అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని టీవీకే అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆ పార్టీలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బెంగళూరు రాజకీయ వర్గాల్లో అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటికీ.. దీనిపై విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీని ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో భాగంగానే ఈ ముందడుగు ఉండబోతోందని, త్వరలోనే బెంగళూరు ఎన్నికల పోటీపై టీవీకే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.