Vegetable Juice Recipe | ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని మనం రోజూ తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకుంటేనే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే తమ ఆరోగ్యం పట్ల చాలా మంది ప్రస్తుత తరుణంలో దృష్టి పెడుతున్నారు. రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రోజూ వెజిటబుల్ జ్యూస్ తాగితే శరీరానిఇక ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీకు నచ్చిన కూరగాయలతో జ్యూస్ తయారు చేసి రోజూ ఒక గ్లాస్ తాగాలి. ఈ జ్యూస్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కలిపి తీసుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
దీప్సికా జెయిన్ అనే ఓ న్యూట్రిషనిస్టు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెజిటబుల్ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో, దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్పారు. వెజిటబుల్ జ్యూస్‌ను తయారు చేసేందుకు మీకు నచ్చిన ఏవైనా రెండు రకాల కూరగాయలను తీసుకోవాలి. కీరదోస, బీట్రూట్, టమాటా, క్యాప్సికం లాంటి వాటిల్లో ఏవైనా రెండు కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. అలాగే విటమిన్ సి కోసం ఉసిరి కాయ జ్యూస్ లేదా నిమ్మరసం తీసుకోవాలి. ఒక ఆకుకూర తప్పనిసరిగా ఉండాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకులో ఏదైనా ఒక ఆకుకూరను తీసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి నీళ్లు పోసి పట్టుకోవాలి. జ్యూస్ రెడీ కాగానే ఒక గ్లాస్ మోతాదులో తాగేయాలి.
ఇలా మీకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలతో వెజిటబుల్ జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగవచ్చు. రోజూ ఒకేలాంటి కూరగాయలను, ఆకుకూరలను వాడాల్సిన పనిలేదు. మీకు అందుబాటులో ఉన్నవాటిని వాడుకోవచ్చు. ఇలా వెజిటబుల్ జ్యూస్‌ను తయారు చేసి తాగితే అనేక లాభాలు కలుగుతాయని ఆమె చెప్పారు. వెజిటబుల్ జ్యూస్‌ను రోజూ తాగితే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. జీర్ణాశయం, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది.
వెజటబుల్ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే చర్మానికి సంరక్షణ లభిస్తుంది. ఈ జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలను పోగొడుతుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మానికి ఉండే సహజసిద్ధమైన సాగే గుణం మరింత పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా, మృదువుగా మారుస్తుంది. వెజిటబుల్ జ్యూస్‌ను తాగుతుంటే శిరోజాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్ సితోపాటు కరివేపాకులు శిరోజాల సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇలా వెజిటబుల్ జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగితే అందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.