Mustard Oil | ఆవాలను మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. కూరలకు పోపు పెట్టేందుకు ఆవాలను వాడుతారు. ఇవి వేయడం వల్ల కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఆవాలను ఊరగాయ పచ్చళ్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే ఆవాల నుంచి తీసే నూనెను కూడా కొందరు ఉపయోగిస్తుంటారు. ఆవ నూనెను కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ఆసియా, ఐరోపా వంటి కొన్ని దేశాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగానే ఉపయోగిస్తుంటారు. ఆవ నూనె ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. కనుక దీన్ని ఉపయోగించేందుకు చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ ఆవనూనె మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆవ నూనెలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఒమెగా 3, ఒమెగా 6 కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఆవనూనెలో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వాపులను తగ్గిస్తుంది.
ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇందులో అలైల్ ఐసోథయోసయనేట్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వల్లే ఆవనూనె ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం ఉండడం వల్ల ఆవనూనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక ఆవనూనెను రాస్తుంటే చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. గజ్జి, తామర వంటి చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆవనూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కనుక ఇవి శరీరంలోని వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. ఆవనూనెను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో రసాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. దీని వల్ల అజీర్తి తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది.
ఆవనూనెను మసాజ్ చేసేందుకు కూడా ఉపయోగిస్తారు. అనేక రకాల మసాజ్ థెరపీలలో ఆవనూనెను వాడుతారు. దీన్ని శరీరానికి రాసి మర్దనా చేయడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి సహజసిద్ధంగా తేమ లభిస్తుంది. ఆవనూనెను శిరోజాలకు సైతం రాయవచ్చు. ఇది జుట్టును, కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను సంరక్షిస్తాయి. జుట్టు కుదుళ్ల వద్ద ఉండే దురదను తగ్గిస్తాయి. దీంతోపాటు చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. ఆవనూనెను తరచూ ఉపయోగిస్తుంటే శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఆవనూనెను వంట చేసేందుకు ఉపయోగించవచ్చు. దీన్ని పలు రకాల కూరల్లో, ఊరగాయల తయారీలో వాడుతారు. వేపుళ్లకు కూడా ఉపయోగిస్తారు. కానీ ఆవనూనెతో వేపుళ్లు చేయకూడదు. ఆవనూనెను ఊరగాయల తయారీకి ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. పప్పు లాంటి కూరలను చేసినప్పుడు ఆవనూనెను వేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. ఆవనూనెను శరీరానికి బాగా పట్టించి మసాజ్ చేయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 1 లేదా 2 సార్తు చేస్తుంటే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఆవనూనెను నేరుగా తీసుకోలేరు. కానీ కూరల్లో లేదా సలాడ్స్ పై చల్లి తీసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెను తీసుకుంటే 124 క్యాలరీల శక్తి లభిస్తుంది. 14 గ్రాముల కొవ్వులు, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఆవనూనెను ఇలా ఉపయోగిస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు.