Urination | మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తాయి. దీంతో మూత్రం తయారవుతుంది. అది ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే పోషకాలను శరీరం శోషించుకున్న తరువాత మిగిలిన వ్యర్థ ద్రవాలను కిడ్నీలు మూత్రంగా మార్చి బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలోనే వ్యక్తులు తాము తీసుకునే ఆహారాలు, తాగే ద్రవాలను బట్టి రోజుకు నిర్దిష్టమైనన్ని సార్లు మూత్ర విసర్జన చేస్తారు. షుగర్ ఉన్నవారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తుల మూత్ర విసర్జన సమయం, పరిమాణం, మూత్ర విసర్జన చేసే సంఖ్య మారుతుంది. ఇక కొందరు నిర్దిష్టమైన సంఖ్య కన్నా తక్కువ సార్లు తక్కువ పరిమాణంలో మూత్ర విసర్జన చేస్తారు. అయితే మూత్ర విసర్జనకు సంబంధించి ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మనిషి నిత్యం తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల నీళ్లను తాగాల్సి ఉంటుంది. అదే వేడి వాతావరణంలో ఉన్నా, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసినా, శరీరంలో వేడి అధికంగా ఉన్నా ఇంకా ఎక్కువ మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది. అయితే నీళ్లను తగిన మోతాదులో సేవిస్తేనే మన శరీరం జీవక్రియలను సరిగ్గా నిర్వహిస్తుంది. దీని వల్ల వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. కనుక నీళ్లను తగిన మోతాదులో రోజూ తాగాల్సి ఉంటుంది. ఇక రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు కనీసం 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 4 సార్ల కన్నా తక్కువగా మూత్ర విసర్జన చేయకూడదు. లేదంటే వ్యాధులు వస్తాయని అంటున్నారు.
ఆల్కహాల్, టీ, కాఫీ తదితర పానీయాలను సేవించినప్పుడు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, నీటిని అధికంగా తాగేవారు రోజుకు సహజంగానే 7 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు, ఆయా సమస్యలు ఉన్నవారు 7 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఫర్వాలేదు. అది సహజమే. అయితే కేవలం 2 లీటర్ల నీళ్లను మాత్రమే తాగుతున్నప్పటికీ అంటే తక్కువ మోతాదులో నీళ్లను తాగుతున్నప్పటికీ రోజుకు 11 సార్ల కన్నా అధికంగా మూత్ర విసర్జన చేస్తే మాత్రం అలాంటి స్థితిని అనారోగ్యంగా భావించాలి. ఈ స్థితిలో ఉన్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. దీంతో పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇక మూత్రాన్ని కొందరు కొన్ని గంటల తరబడి అలాగే ఆపేస్తారు. ఇలా అసలు చేయకూడదు. దీని వల్ల మూత్రాశయ సైజు పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను, ప్రోస్టేట్ సమస్యలను కలగజేస్తుంది. కనుక మూత్రాన్ని ఎక్కువ సేపు బంధించకూడదు. ఎప్పుడు మూత్ర విసర్జన చేయాలనిపిస్తే అప్పుడు వెళ్లాల్సిందే. ఇక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. మరీ తెల్లగా ఉన్నట్లు కనిపిస్తే మీరు నీళ్లను అధికంగా తాగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. నీళ్లను సరిగ్గా తాగకపోతే కొందరికి మూత్రం పసుపు రంగులో లేదా గోధుమ రంగులో వస్తుంది. కొన్ని రకాల ఆహారాలను తిన్నప్పుడు లేదా ద్రవాలను తాగినప్పుడు మూత్రం సహజంగానే రంగు మారుతుంది లేదా వాసన వస్తుంది. కానీ ఎలాంటి ఆహారాలను తీసుకోకుండానే మూత్రం రంగు మారడం, వాసన వస్తుండడం వంటివి గమనిస్తే మూత్రాశయ లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తించాలి. ఇలాంటి స్థితిలో డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక డయాబెటిస్ ఉన్నవారికి మూత్రం తియ్యని వాసన అనిపిస్తుంది. మూత్రంలో దాదాపుగా 95 శాతం వరకు నీరే ఉంటుంది. మిగిలింది వ్యర్థాలు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్ర విసర్జన వ్యవధి దాదాపు 7 సెకండ్ల వరకు ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ వ్యవధి తగ్గుతుంది. తక్కువ సమయం పాటు మూత్ర విసర్జన చేస్తారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. రోజుకు 2 లీటర్ల నీళ్లను తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 లీటర్ల మేర మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాడు. గంటకు దాదాపుగా 35 నుంచి 70 ఎంఎల్ వరకు మూత్రం ఉత్పత్తి అవుతుంది. ఇలా మూత్రానికి సంబంధించి మనం అనేక ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవచ్చు.