లండన్ : కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ ఎంతటి కీలకమో తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న వారు వైరస్ బారినపడితే మరణాల ముప్పు 32 రెట్లు అధికమని జాతీయ గణాంక కార్యాలయం (ఓఎన్ఎస్) వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి సెప్టెంబర్ 24 మధ్య సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలను రాబట్టామని ఓఎన్ఎస్ తెలిపింది.
వ్యాక్సిన్ తీసుకోనివారు ప్రతి లక్షమందిలో 849 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా, కనీసం 21 రోజుల వ్యవధితో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ప్రతి లక్ష మందిలో కేవలం 26.2 మందే మృత్యువాతన పడినట్టు తేలింది. కరోనా ముప్పును నివారించడంలో వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వెల్లడిస్తోందని, ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని బ్రిటన్ ఆరోగ్య అధికారులు కోరారు.