Brain Health | మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అలాగే మన ఆలోచనలు, భావోద్వేగాలను సైతం నియంత్రిస్తుంది. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల మన మెదడుకు దీర్ఘకాలంలో హాని కలుగుతుంది. కానీ దీన్ని చాలా మంది గమనించరు. దీర్ఘకాలంలో మెదడుపై పడే ప్రభావాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతుంటారు. దీంతో మెదడు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. కానీ పలు జాగ్రత్తలను పాటిస్తే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన శరీరంలో ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఎలాగైతే జాగ్రత్తలను పాటిస్తామో అలాగే మెదడు విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మెదడు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను చేయరు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఆఫీస్‌కు లేట్ అవుతుందని లేదా డైటింగ్ అని చెప్పి కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను సరిగ్గా చేయరు. ఇలా కొందరు నిరంతరాయంగా ఉదయం ఆహారం తీసుకోరు. అయితే దీని ప్రభావం మెదడుపై కచ్చితంగా పడుతుంది. అలాగే కొందరు భోజనానికి, భోజనానికి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటారు. ఇలా కూడా చేయరాదు. ఈ రెండు సందర్భాల్లోనూ మెదడు మొద్దుబారిపోతుంది. మెదడుకు గ్లూకోజ్ సరిగ్గా లభించదు. దీంతో నీరసంగా అనిపిస్తుంది. ఉత్సాహంగా ఉండరు. యాక్టివ్‌గా పనిచేయలేరు. పనిపై ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సన్నగిల్లిపోతాయి. ఇక మన శరీరం పోషకాలను సరిగ్గా శోషించుకోలేదు. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేయలేదు. దీర్ఘకాలంలో ఇది మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ను కచ్చితంగా చేయాలి. అలాగే భోజనానికి, భోజనానికి మధ్య గ్యాప్ మరీ ఎక్కువగా కూడా ఉండకూదదు.
కొందరు ఒకే సమయంలో అనేక పనులను చేస్తుంటారు. ఒకేసారి ఏదైనా ఒక పని మీద మాత్రమే ధ్యాస పెట్టాలి. అన్ని రకాల పనులను ఒకేసారి చేయడం వల్ల మెదడుపై భారం పడుతుంది. దీంతో మెదడుకు ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. మెదడు షార్ప్‌గా పనిచేయదు. కనుక ఒక సమయంలో ఒకే పని మీద దృష్టి పెట్టాలి. దీంతో మెదడుపై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. కొందరు నిరంతరాయంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పెద్ద వాల్యూమ్‌తో మ్యూజిక్ వింటుంటారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీని వల్ల దీర్ఘకాలంలో చెవుల వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. అలాగే మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. కనుక ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువగా ఉపయోగించకూడదు.
ప్రస్తుతం చాలా మంది రోజూ బిజీ జీవితం గడుపుతున్నారు. అయితే దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ వీటి నుంచి బయట పడకపోతే దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇలా జరిగితే అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే చాలా మందిని నిద్రలేమి సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించకపోయినా కూడా ఆ ప్రభావం మెదడుపై పడుతుందట. దీంతో మెదడులోని కొన్ని భాగాలు కుచించుకుపోయి అది మనిషి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. కనుక ఈ అలవాట్లు ఉన్నవారు వెంటనే వాటిని మానుకుంటే మంచిది. లేదంటే మెదడు ఆరోగ్యం దెబ్బ తిని తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.