World sight day | సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. కళ్లు మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధి. మనం ప్రతీ వస్తువును చూడాలన్నా కళ్లు చాలా అవసరమని తెలిసినా చాలా మంది కళ్ల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. కంటి నుంచి నీరు కారినప్పుడో.. తలనొప్పిగా ఉన్నప్పుడో.. మామూలు అద్దాల దుకాణానికి వెళ్లి పరీక్షలు చేయించుకోకుండానే కంటి అద్దాలు వాడుతుంటారు. కళ్లను మనం జాగ్రత్తగా చూడకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అవగాహన కల్పించందుకు ప్రతి ఏటా అక్టోబర్ రెండో గురువారం నాడు ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ ను నిర్వహిస్తున్నారు.
అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసి వీలున్నంత మందికి మెరుగైన కంటిచూపును అందించడమే ఈ ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ ప్రత్యేకత. ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘కంటివెలుగు’ పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం, సర్జరీలు చేయడం, మందులు ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. మొత్తం 2,806 గ్రామాల్లో 50 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఇవీ జాగ్రత్తలు..
కంటి చూపును మంచిగా ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఏ విటమిన్‌తో పాటు బీటారెరోటిన్ అధికంగా లభించే క్యారెట్లు నిత్యం తినేలా చూసుకోవాలి. గుడ్లు, బీన్స్, నారింజ పండ్లు, బొప్పాయి, బాదాం ఎక్కువగా తినాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలను ఎక్కువగా తినాలి.
కళ్లు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.
ఆకు కూరలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్ సీ, ఈ అధికంగా ఉండి కళ్లను కాపాడుతాయి.
సిగరెట్ స్మోకింగ్ వల్ల కంటి శుక్లాలు, కంటి నరాలు దెబ్బతిని దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకని సిగరెట్ స్మోకింగ్‌ను వెంటనే మానుకోవాలి.
సూర్యకిరణాల్లోని హానికారక ఆల్ట్రా వయోలెట్ కిరణాలు కంటిని గాయపరుస్తాయి. అందుకని బయటకు వెళ్లాల్సిన సమయాల్లో యూవీ సన్ గ్లాసెస్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.
కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సమయం గడిపి వారి కళ్లు పొడిబారుతుంటాయి. దీని నుంచి బయట పడటానికి ఎక్కువ సార్లు కళ్లు మిణకరించేలా చూడాలి.
టీవీ చూసేటప్పుడు లేదా కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాస్‌లను ధరించడం వల్ల కళ్లపై భారం పడకుండా ఉంటుంది.
కూల్ గ్లాసెస్ వాడేటప్పుడు అవి యూవీ రేస్ నుంచి కాపాడేలా ఉండటం చూసుకోవాలి. కంట్లో నలుసు పడినప్పుడు చేత్తో నలపడంగానీ, రుద్దడంగానీ చేయకూడదు. చేతికున్న మట్టి, ధూళి, సూక్ష్మక్రిములు కంటిలోకి చేరి అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ను కలిగించే ప్రమాదముంటుంది.
వంట చేసేటప్పుడు, వేడి అవిరి కళ్ళకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో దుమ్ము పడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని మంచి నీటిని కళ్ళ మీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్ళు తుడుచుకోవాలి.
ఎక్కువ సమయం టీవీలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ ముందు కూర్చోకుండా చూసుకోవాలి. తప్పనిసరిగా అలా కూర్చోవాల్సి వచ్చినప్పుడు ప్రతి అర్ధ గంటకు ఒకసారి కండ్లను పక్కకు తిప్పుకోవాలి.
ప్రతి రోజు 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలోని వస్తువును చూడాలి. ఇలా చేయడం వల్ల కంటికి వ్యాయామం లభించి కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
చివరగా..
కళ్లను దానం చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతారు. ఇవాలే మీ కళ్లను దానం చేయడానికి ప్రమాణం చేయండి. మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి.