Older persons day | చెట్టుకు పూసిన పూలు వాడిపోక మానవు. అలాగే, పుట్టిన ప్రతి మనిషిలో వృద్ధాప్యం రాకమానదు. ఇదంతా సృష్టిధర్మంలో భాగం. ప్రతి ఇంట్లోనూ ముసలివాళ్లుండటం సర్వసాధారణం. అన్ని దశల మాదిరిగానే వృద్ధాప్యం వస్తుంది. ఇది అచ్చం పసితనం మాదిరిగానే ఉంటుంది. కొంటె అల్లరి వీరిలో కనిపిస్తుంది. చిన్న పలకరింపునే వారు కోరుకుంటుంటారు. ఆత్మీయుల కోసం ఎదురు చూస్తుంటారు. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాలని ఉబలాటపడుతుంటారు. అదేదో తప్పయిపోయినట్లు చాలా మంది వారిపై కసురుకుంటుంటారు. ఒకరోజు మనమూ వృద్ధులమవ్వాల్సిందే అన్నది మరిచిపోవద్దని చెప్పడానికే ఏటా అక్టోబర్ 1 వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటాం.
ప్రస్తుత సమాజంలో అందరు ఉన్నా ఏకాకుల మాదిరిగా జీవనం సాగిస్తున్నారు చాలా మంది వృద్ధులు. కొడుకు ఉద్యోగమే కారణంగా కావచ్చు.. మామను తండ్రిలా చూసే గుణం కోడలిలో లేకపోవడం కావచ్చు. ఏదైతేనేం.. తమ అందమైన జీవితాన్ని కుమారులు, కుమార్తెల విద్యాబుద్ధులు, పెండ్లిళ్లు, ఉద్యోగాల కోసం వెచ్చిస్తున్నా.. మలిదశలో వారు కనీస ఆత్మీయత కూడా అందకోలేని దుస్థితిలో ఉంటున్నారు. మలిసంధ్యకు చేరి ఆసరాగా లేని వారి వల్లే ఎన్నో వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. ప్రేమ, ఆత్మీయతలు లేని సంసారాల వల్ల, ఉద్యోగాల పేరిట దూరమైపోయిన కొడుకు- కోడళ్ల వల్ల, గృహసంబంధ వివాదాల వల్ల.. దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కారణమేదైనా ఫలితం మాత్రం పండుటాకులైన తల్లిదండ్రుల మీద పడుతున్నది.
వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు
ఇలా నిరోధిద్దాం..
అవసాన దశలో బుక్కెడు బువ్వకు, జానెడు నీడకు తడుముకోవాల్సిన దీనస్థితిలో చిక్కుకుపోకుండా చూడాల్సిన కనీస ధర్మం మనది. వారి ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ద చూపుదాం. వారిని మన పిల్లల్లానే ఆదరిద్దాం. చివరి రోజుల్లో ఆనందంగా ఉండనిస్తూ మనమూ ఆనందంగా గడుపుదాం. ప్రతి ఒక్కరిలో వృద్ధాప్యం అనివార్యం.. సహజం అనేది మరిచిపోయి ప్రవర్తించకుండా ఉందాం.