Onion prices : దేశంలో ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే చక్కెర ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇటు ఇతర కూరగాయల ధరలు కూడా నెమ్మదిగా పెరగుతున్నాయి. దీంతో వంటింటి ఖర్చు పెరిగి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే, ఇది శ్రావణ మాసం. పైగా వరుసగా పండుగలు జరుపుకొనే సమయం.
ఈ సమయంలో ఉల్లి, చక్కెర వంటి నిత్యావసరాల ధరలు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా కేంద్రం ఉల్లి నిల్వల్ని పెంచుతోంది. ఇందుకోసం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రత్యేకంగా కంద ఎక్స్ప్రెస్ రైలును అనేక ప్రాంతాలకు పంపిస్తోంది. ఈ రైలు నిండా ఉల్లి నిల్వలున్నాయి. మొట్టమొదటగా ఈ రైలు ఢిల్లీ చేరుకుంది. ఈ రైలులో 800 మెట్రిక్ టన్నుల ఉల్లి నిల్వలున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఉల్లి నిల్వలతో కూడిన రైళ్లను పంపిస్తారు.
గత నెల రోజులుగా మార్కెట్లోకి ఉల్లి సరఫరా బాగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడానికి కారణం ప్రస్తుత ఖరీఫ్ పంట ఆలస్యం కావడమే. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఉల్లి రబీ పంట ద్వారా వచ్చింది. ఈ పంట నిల్వలు ఇప్పుడు పూర్తవుతున్నాయి. అయితే, ఖరీఫ్ ఆలస్యం కావడం వల్ల ఉల్లి దిగుబడి ఇంకా రాలేదు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం సెప్టెంబర్తోపాటు అక్టోబర్లో కూడా ఉల్లి ధరల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్ పంట దిగుబడి వచ్చే వరకు ధరల పెరుగుదల ఉంటుంది.
ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఉల్లి కిలో ధర సగటున రూ.42 వరకు పలుకుతోంది. ఢిల్లీలాంటి చోట్ల రూ.65-రూ.70 వరకు ఉంటోంది. ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో చక్కెర ధరలు కూడా ఇటీవల పెరుగుతున్న సంగతి తెలిసిందే.