ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. ఆ వ్యసనాన్నివదిలించుకోలేరు చాలామంది. కారణం పొగాకులోని నికోటిన్. ఈ పదార్థం మెదడును బానిసను చేసుకోగలదు. అయితేనేం, కొన్నిచిట్కాలతో సిగరెట్టుకు అడ్డుకట్ట వేయవచ్చు.చాలామంది సిగరెట్ తాగకపోతే ఒత్తిడి, కుంగుబాటు, ఏకాకితనం, ఆందోళన తదితర మానసిక సమస్యలకు గురవుతారు. మనసు బాగాలేకపోయినా సిగరెట్లనే ఆశ్రయిస్తారు. అయితే సిగరెట్లతో ఎంత ఉపశమనం లభించినా, దీనికంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు అనేకం ఉన్నాయనే సంగతి మరచిపోవద్దు. ధ్యానం, వ్యాయామం, ప్రాణాయామం మనోబలాన్ని ఇస్తాయి. మానసిక జాడ్యాలను దూరం చేస్తాయి.
స్నేహితులు, కుటుంబసభ్యులు, సహోద్యోగులలో ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉంటే.. ఆ వ్యసనం మనల్నీ అంటుకోవచ్చు. పొగ మానేసినా.. పొగ రాయుళ్ల సమక్షంలో ఉన్నప్పుడు మళ్లీ సిగరెట్ వెలిగించాలనే కోరిక కలగవచ్చు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ‘నో స్మోకింగ్ జోన్’లోనే ఉండాలి. అలాంటి మిత్రుల మధ్యే కాలక్షేపం చేయాలి.
కొంతమంది పొగరాయుళ్లు భోజనం తర్వాత సిగరెట్ వెలిగించకుండా ఉండలేరు. తిన్న తర్వాత ఓ పండుగానీ, ఆరోగ్యకరమైన డెజర్ట్గానీ, చాక్లెట్ కానీ, బబుల్ గమ్లాంటివి కానీ నోట్లో వేసుకోవడం ద్వారా ఈ కోరికను అణచుకోవచ్చు.
సిగరెట్లను మానేసే క్రమంలో మనసును నియంత్రించుకోవడం కష్టమైపోతుంది. అయితే, ఈ సమయంలో సిగరెట్ తాగాలనే బలమైన కోరిక కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటే ఉంటుంది. ఆ కీలక క్షణాల్లో ఇతర వ్యాపకాల మీద దృష్టి సారించడం ద్వారా పొగ యావను పక్కదారి పట్టించవచ్చు.
అంతేకాదు, మీరెందుకు సిగరెట్లు మానేయాలని అనుకుంటున్నారో మీకు మీరే గుర్తుచేసుకోండి. పొగతాగడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధుల లాంటివాటి ముప్పును ఊహించుకోండి.ఆ సమయంలో ఆత్మీయులు అనుభవించే మనోవేదనను అర్థం చేసుకోండి.
పుస్తక పఠనం, పత్రికలు చదవడం, ఇష్టమైన సంగీతం వినడం, పదకేళికలు, సుడోకు పజిళ్లు నింపడం, ఆన్లైన్ గేమ్స్‌తో మనసును బిజీగా ఉంచుకోవాలి. చేతులు ఖాళీగా లేకుండా పెన్సిల్, పెన్ను, పేపర్ క్లిప్పుల లాంటివి చేతుల్లో ఉంచుకోవడం ద్వారా సిగరెట్ల మీదికి మనసు పోకుండా నియంత్రించుకోవచ్చు. సిగరెట్ ఆలోచన వచ్చినప్పుడు కొవ్వొత్తి, అగరొత్తి లాంటివి వెలిగించడం ద్వారా ఆ కోరికను వాయిదా వేసుకోవచ్చు. పొగతాగడం నిషేధించిన గ్రంథాలయాలు, షాపింగ్ మాల్స్, కళాకేంద్రాలు.. తదితర చోట్లకు తరచూ వెళ్లడమూ మంచి ఆలోచనే.
ధూమపానం ఆకలిని చంపేస్తుంది. ఒక్కసారిగా పొగ మానేయడంతో ఆకలి పెరుగుతుంది. దాంతో శరీరం బరువు కూడా పెరుగుతుంది. అందుకే కొంతమంది సిగరెట్లు మానేయాలంటే మీనమేషాలు లెక్కపెడుతుంటారు. ఆరునెలల పాటు కొంచెం బరువు పెరిగినా, తరువాత దానిని తగ్గించుకోవడం పెద్దపనేం కాదు. కాబట్టి, ఒకసారి నిర్ణయించుకున్నాక మళ్లీ పొగాకు వైపు వెళ్లనే వద్దు.
పొగ మానేశాక పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు భోజనంలో భాగం చేసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం, శీతల పానీయాలు, వేపుళ్లు మొదలైనవి దూరంపెట్టాలి.