లయ తప్పకముందే స్పందిద్దాం
లబ్ డబ్.. లబ్ డబ్.. ఈ శబ్దం లయబద్ధంగా సాగినంత వరకూ ఏ ప్రమాదం లేదు. ఈ లబ్ డబ్ వేగం శ్రుతి మించినా,అతిగా మందగించినా.. గుండె ప్రమాదంలో ఉన్నట్టే! గుండె బలహీనంగా మారిందంటే.. మొత్తం శరీరానికి ముప్పు పొంచి ఉన్నట్టే! పిడికెడు గుండెలో మన ప్రాణమంతా ఉంది. అలాంటి హృదయాన్ని పదిలంగా చూసుకుంటే.. మన ఆరోగ్యమూ భేషుగ్గా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. గుండెను బలహీనపరిచే పరిస్థితులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలు నేటి ఊపిరిలో తెలుసుకుందాం!
హార్ట్ ఫెయిల్యూర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు గుండె చేసే పనులేమిటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గుండె ప్రధానంగా ఓ మహాకండర అవయవం. శరీరంలో అవయవాలన్నిటికీ నిరంతరాయంగా రక్తం సరఫరా చేసే ఓ పంపింగ్ మోటార్. ఈ రక్తప్రసరణ ద్వారానే అవయవాలకు పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. అంతేకాదు రక్తంలో చేరిన కార్బన్ డయాక్సైడ్, శరీర ధర్మక్రియల వల్ల జనించిన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు కూడా జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో రక్త ప్రసరణ వ్యవస్థ నిర్వహణ, నిబద్ధతకు గుండె బాధ్యత వహిస్తుంటుంది. ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను స్వీకరించటం, కార్బన్ డయాక్సైడ్ను బయటికి పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది.
హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు?
పలురకాల పరిస్థతుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనవి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), కరోనరీ ఆర్టరీ డిసీజ్, మధుమేహం (డయాబెటిస్), స్థూలకాయం (ఒబెసిటి). వీటితోపాటు వైరస్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో-రేడియేషన్ (క్యాన్సర్ చికిత్సలో) అనంతర స్థితి, వాపు (ఇన్ఫ్లమేటరీ స్టేట్) కూడా గుండె దెబ్బతినటానికి కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించి, త్వరగా మేల్కొంటే గుండెకు జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించటం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించటం ముఖ్యం. గుండెకు పునర్జీవన సామర్థ్యం లేనందున ఈ జాగ్రత్త.. కీలకమైన రోగనిరోధక చర్యకాగలదు.

Heart Failure
నిరోధించటం ఎలా?
ఈ వ్యాధిని నిరోధించటం పట్ల చాలామందికి ఆసక్తి ఉండటం సహజం. సానుకూల విషయం ఏంటంటే చాలా కేసుల్లో హార్ట్ ఫెయిల్యూర్‌ను అడ్డుకోవడం సాధ్యమే. ఇందుకోసం ముందుగా అధిక రక్తపోటును అదుపుచేయాలి. అయితే అధిక రక్తపోటు చికిత్స విషయంలో చాలామంది ఉదాసీనంగా వ్యవహరిస్తుంటారు. వారు ఈ చికిత్స తాలూకు సైడ్ఎఫెక్ట్స్ గురించి భయపడుతుండటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడటమే అధిక రక్తపోటును అదుపుచేయాల్సిన అవసరం వెనుక కారణమని మనం అర్థం చేసుకోవాలి. అధిక రక్తపోటును నియంత్రించకపోతే గుండె ధమనులు తీవ్రంగా దెబ్బతిని, హృదయ కండరాలు మందంగా తయారవుతాయి. దీంతో రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యం చాలా వరకు తగ్గిపోతుంది. ఒక్కోసారి ఈ పరిస్థితి గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
మధుమేహం, స్థూలకాయం కూడా ఇదే రీతిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ఈ రెండిటినీ అదుపుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధుమేహం, స్థూలకాయం తగ్గించుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని చేరుకోవటానికి కృషి చేయాలి. అధిక మద్యపానం నేరుగా గుండెకు నష్టం కలిగిస్తుంది. ధూమపానం గుండెకు ప్రత్యక్ష శత్రువు అని గుర్తుంచుకోండి. సత్వరం వీటికి స్వస్తి పలకండి. పోషకాహార లోపం కూడా గుండెను కుదేలు చేస్తుంది. పైన పేర్కొన్న సమస్యలను పరిశీలిస్తూ, తదనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు భద్రత చేకూర్చవచ్చు.
గుండె ఆరోగ్యం కోసం రోజుకు 30-35 నిమిషాలకు తగ్గని వ్యాయామం చేయడం అనివార్యం. పండ్లు, కాయగూరలతో కూడిన డైట్ పాటించాలి. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇవన్నీ గుండెకు భద్రతను అందిస్తాయి. శరీరంలో చెడు కొవ్వు పెరిగితే.. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ధమనుల లోపలి భాగం కుంచించుకపోవడం వల్ల హృదయం బలహీనపడి గుండెపోటు వస్తుంది.
శరీరానికే నష్టం..
గుండెకు చిన్నపాటి నష్టం జరిగినా.. ఆ ప్రభావం శరీరంలోని అవయవాలన్నిటి కణజాలం మీద పడుతుంది. వివిధ శరీర క్రియలు మందగిస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ఆయా అవయవాల కణజాలం శాశ్వతంగా దెబ్బతింటుంది. రక్త ప్రసరణలో లోటుపాట్లను తట్టుకోవటానికి శరీరంలోని అవయవాలు ప్రయత్నిస్తాయి. ఈక్రమంలో జరిగే పరిణామాల వల్ల సహజంగానే శరీరం పనితీరు దెబ్బతిని ఆరోగ్యం దిగజారుతుంది. మూత్రపిండాలు అధిక మొత్తంలో నీరు, లవణాలను నిల్వచేయటానికి పూనుకుంటాయి. ఇది ప్రసరణకు తోడ్పడినా శరీరంలో వాపులకు దారితీస్తుంది. ఆహారనాళం, కాలేయంలో ఒత్తిడి పెరిగి ఆకలి మందగించి, పోషక పదార్థాలను స్వీకరించటం తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పరిస్థితిని గుర్తించిన మెదడు పంపే సందేశంతో గుండె వేగంగా కొట్టుకోవటం మొదలు పెడుతుంది. ప్రారంభంలో ఇది సహాయకారిగా ఉన్నా.. తరువాతి దశలో అప్పటికే దెబ్బతిన్న గుండె పనితీరు మరింత మందగిస్తుంది. ఈ పరిణామాలన్నీ ఓ విష వలయంలా సాగి ఆరోగ్య పరిస్థితి వేగంగా దిగజారుతుంది.
గుర్తించటం ఎలా?
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలను రోగులు, వైద్యులు వీలైనంత వేగంగా గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకుని ఉన్నా శ్వాస అందకుండా ఇబ్బంది కలిగితే అనుమానించాల్సిందే! తీవ్రమైన అలసట, కాళ్లలో వాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి, పొట్ట ఉబ్బటం ఇవన్నీ గుండె బలహీనమవుతుందని చెప్పే హెచ్చరికలే! కొన్నిసార్లు ఈ లక్షణాలు శ్వాసకోశ, గ్యాస్ట్రో ఇంటస్టయినల్ వ్యాధులలోనూ కనిపించవచ్చు. అందువల్ల ఈ లక్షణాలు, రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి అంచనా వేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో హార్ట్ ఫెయిల్యూర్‌ను నిర్ధారించుకోవటానికి డాక్టర్లు సాధారణంగా ఇ.సి.జి, 2డి ఎకో కార్డియోగ్రఫీ, కొన్ని రక్తపరీక్షలు చేయించాల్సిందిగా సూచిస్తారు.
ఇటీవలి సంవత్సరాలలో మరిన్ని ఆధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్ ఫెయిల్యూరును గుర్తించటం, వర్గీకరించటం చేస్తున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటి వల్ల వ్యాధిని వేగంగా నిర్ధారించగలుగుతున్నారు. వీటిలో 3డి తో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ కచ్చితత్వాన్ని మెరుగుపరిచింది. ఇది గుండె, గుండె కవాటాల పనితీరు, గుండెలో ఒత్తిడిని అధ్యయనం చేయటానికి సాయపడుతుంది.
ఎకో ద్వారా పూర్తి నిర్ధారణకు రాలేని సందర్భాలలో కార్డియాక్ ఎం.ఆర్.ఐ. ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నది. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియర్ స్కాన్స్ (పెట్, స్పెక్ట్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు. కాథటరైజేషన్ ద్వారా కరోనరీ ధమనులలో రక్తప్రసరణ గమనించటమే కాకుండా గుండె-ఊపిరితిత్తులలో ఒత్తిడిని తీవ్రతను కొలువగలుగుతున్నారు.
గుండెలో వాపు ఏమైనా ఉన్నదని గుర్తించేందుకు కొన్నిసార్లు న్యూక్లియర్ స్కాన్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. కొన్ని రకాల హార్ట్ ఫెయిల్యూర్లకు కారణాలను గుర్తించేందుకు ఎండోకార్డియల్ బయాప్సీ చేయించాల్సిందిగా సూచిస్తున్నారు. పరిశ్రమల కాలుష్యం ప్రభావాన్ని అంచనా వేయటానికి టాక్సికాలజీ సాయం తీసుకుంటున్నారు.
మొత్తం మీద నష్టం జరగకముందే మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టం నివారించవచ్చు. అదే విధంగా ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్త సరఫరాను పునురుద్ధరించటం చాలా కీలకం. దీనివల్ల తక్షణ రక్షణతోపాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోవచ్చు. దీర్ఘకాలంలో వచ్చే దుష్ఫలితాలను అరికట్టినట్టు అవుతుంది. గుండెను కాపాడుకోవడం అంటే.. సంపూర్ణ ఆరోగ్యానికి
స్థిరమైన అడుగు వేయడమని గుర్తుంచుకోండి.
డాక్టర్ అనూప్ అగర్వాల్
సీనియర్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సికిందరాబాద్