పిల్లలు పక్కతడిపే అలవాటు తప్పించడానికి సాయంత్రం వేళ పండ్లరసాలు, తియ్యని పానీయాలు తాగించకుండా ఉండాలి. పానీయాలు పగటి వేళలోనే ఇవ్వాలి. పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు వేయించినవి, ఉప్పగా ఉండేవి తినిపించకూడదు. అలాగే పాలు, పాలపదార్థాలు కూడా తినిపించకూడదు. పిల్లలు పడుకున్న రెండు, మూడు గంటల తర్వాత పెద్దవాళ్లు వాళ్లను నిద్రలేపి బాత్ రూమ్‌కి తీసుకుపోవాలి.
పిల్లలకు పక్క తడిపే అలవాటు ఉండటం సాధారణమే. వయసు పెరిగే కొద్దీ ఆ అలవాటు పోతుంది. కానీ, కొందరిలో ఆరేళ్ల వయసు దాటినా పక్క తడిపే అలవాటు పోదు. ఆ సమస్యను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాళ్లను తిట్టడం వల్ల మార్పేమీ ఉండదు. పైగా, అవమానంగా భావిస్తారు. బాధపడతారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్లను అర్థం చేసుకోవాలి. ఆరేళ్ల వయసు దాటాక కూడా పక్క తడిపే అలవాటు ఉంటే వైద్యులకు చూపించాలి.
కొంతమంది పిల్లలు తొలుత ఈ అలవాటు మానినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ దాన్ని కొనసాగిస్తారు. అలాంటప్పుడు కూడా వైద్యులకు చూపించాలి. మూత్ర విసర్జక వ్యవస్థలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? మూత్రనాళ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా? మరేదైనా సమస్య ఉందా… అనేది రోగనిర్ధారణ పరీక్షల ద్వారా వైద్యులు నిర్ణయిస్తారు. దానికి తగిన మందులు ఇస్తే వాటిని వాడాలి. అలాగే పిల్లల ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి.
– డాక్టర్ అనుపమ వై.
సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్