Immunity boosters | చలికాలంలో మనం ఎక్కువ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటాం. ఈ సీజన్లో మనం తినే ఆహారపు అభిరుచుల్లో కూడా మార్పులు కనిపిస్తాయి. చలికాలంలో వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడే మన శరీర సామర్ధ్యం తగ్గిపోతుంది. ఫ్లూ, శ్వాస కోశ వ్యవస్థ వివిధ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఎన్నో వ్యాధులతో మనం ఇబ్బంది పడుతుంటాం. అలాకాకుండా కొన్ని ప్రత్యేక పానీయాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే వీలుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
వాతావరణం చల్లగా ఉండటంతో మన శరీరాన్ని వేడెక్కించేందుకు వేయించిన జంక్ ఫుడ్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటాం. అలాకాకుండా వివిధ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు సరైన పోషకాహారాలను తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, మసాలా దినుసుల, వనమూలికలతో అనేక అనారోగ్యాల నుంచి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. చలికాలపు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని రుచికరమైన, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.
మసాలా టీ
చలి నుంచి వెచ్చదనం పొందడానికి మసాలా టీని మించింది లేదు. ఈ టీ తయారీలో తులసి ఆకులు, అల్లం, లవంగాలు వాడుతుంటారు. దాంతో మనకు కమ్మటి రుచితోపాటు మంచి ఔషధ మూలాలు అందుతాయి. రోజుకో కప్పు మసాలా టీ తీసుకోవడం వల్ల గొంతు జీర పోవడం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే, వ్యాధినిరోధక వ్యవస్థ కూడా బలంగా మారి వైరల్ జ్వరాలు రాకుండా మనల్ని కాపాడుతుంది. మన వద్ద చాలా ప్రాంతాల్లో ఈ టీని ఏడాదంతా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటుంటారు.
పంజిరి
పంజిరి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సాయపడే సుగంధ ద్రవ్యాలతో కూడిన పౌడర్. పిల్లలు, పెద్దలు కూడా ఈ పంజిరిని తీసుకునేందుకు ఇష్టపడతారు. దీని తయారీలో నట్స్, డ్రైఫ్రూట్స్ కలిపితే రుచితో పాటు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
పసుపు పాలు
మనలో చాలా మంది ఈ డ్రింక్ తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. పసుపు పాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి మనలో రోగనిరోధకతను పెంచుతాయి. అలాగే చల్లటి వాతావరణంలో మనల్ని వెచ్చగా ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనల్ని గాయాల నుంచి కోలుకునేందుకు సాయపడతాయి.
మసాలా బెల్లం
చలికాలంలో చాలా మంది బెల్లం తినేందుకు ఇష్టపడుతుంటారు. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు రోగనిరోధకశక్తిని సహజంగా పెంచడంలో సాయపడతాయి. మసాలా బెల్లం ద్రావకం తయారీకి బెల్లం, నెయ్యి, అల్లంతో పాటు ఇతర వనమూలికలను కలుపుతారు. ఈ ద్రావకాన్ని నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
కదా
చలికాలంలో తీసుకునే పానీయాల్లో కదా ఒకటి. పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, తేనెతో కలపి కదా ను తయారుచేస్తారు. ఈ హెర్బల్ కాంబినేషన్ డ్రింక్ జలుబు, దగ్గులను సమర్థంగా నివారిస్తుంది. ఈ మూలికలు, మసాలా దినుసులన్నింటినీ నీటితో కలిపి కొన్ని నిమిషాలు ఉడకబెట్టాలి. అనంతరం మసాలా దినుసులను వడకట్టి.. రుచి, పోషకాలతో నిండిన ఈ వేడి నీటిని తాగాలి.
నల్ల మిరియాల టీ
ఎంతో శక్తివంతమైన మసాలా అయిన నల్ల మిరియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆహారానికి సువాసనను జోడించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణకారిగా కూడా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో సాయపడుతుంది. నల్ల మిరియాలు శరీరంలోని తెల్ల రక్త కణాలను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వీటిలో ఉండే పైపెరిన్ అనేది కణాలను రక్షించడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.