Sitting Jobs | ఆధునిక జీవనశైలిలో రోజుకు 8 గంటలకు పైగా కూర్చునే అలవాటు చాలా మందికి సాధారణంగా మారిపోయింది. ఆఫీసులో కంప్యూటర్ ముందు పని చేయడం, ట్రాఫిక్‌లో ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం లేదా ఇంటికి వచ్చాక కూడా మొబైల్, టీవీల ఎదుట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కాళ్లలో రక్త ప్రసరణ దెబ్బతిని, భవిష్యత్తులో రక్తనాళాల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం సహజంగా కదలికల కోసం నిర్మాణమైందని, కానీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ల కండరాలు పనిచేయకుండా పోతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కాళ్ల కండరాల కదలికలే రక్తాన్ని తిరిగి గుండె వైపు పంపించడంలో సహాయపడతాయి. అయితే గంటల తరబడి కూర్చుంటే ఈ ప్రక్రియ మందగించి రక్తం కాళ్లలోనే నిలిచిపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల క్రమంగా రక్తనాళాల పనితీరు దెబ్బతింటుందని పేర్కొంటున్నారు.
కాళ్లలో రక్త ప్రసరణ సరిగా లేకపోతే మొదట కనిపించే ముఖ్య లక్షణాల్లో ఒకటి మడమలు, పాదాలు, కాళ్ల దిగువ భాగంలో వాపు రావడం. దీన్ని పెరిఫెరల్ ఎడిమా అని పిలుస్తారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తం కాళ్లలో నిలిచిపోవడంతో ద్రవం చర్మ కణజాలాల్లోకి చేరి వాపులకు కారణమవుతుంది. రోజు ముగిసే సమయానికి చెప్పులు బిగుతుగా అనిపించడం లేదా సాక్స్ తీసేసిన తర్వాత మడమల వద్ద గాట్లు కనిపించడం ఈ సమస్యకు సంకేతాలుగా చెప్పవచ్చు. అలాగే స్పైడర్ వీన్స్, వెరికోస్ వీన్స్ కనిపించడం కూడా ఇంకో ముఖ్య హెచ్చరిక సంకేతంగా చెప్పవచ్చు. సాధారణంగా రక్తనాళాల్లో ఉండే చిన్న వాల్వులు రక్తం వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. కానీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్లలో ఒత్తిడి పెరిగి ఈ వాల్వులు బలహీనపడతాయి. ఫలితంగా చర్మం కింద ఎరుపు, నీలం లేదా ఊదా రంగులో సన్నని రక్తనాళాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మరింత తీవ్రమైతే పెద్దగా వాపులకు గురై, మెలికలు తిరిగిన నీలి రంగు రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. ఇవి కేవలం అందానికి సంబంధించిన సమస్యలే కాకుండా రక్త ప్రసరణలో లోపానికి సంకేతాలని వైద్యులు చెబుతున్నారు.
చాలాసేపు కూర్చున్న తర్వాత కాళ్లలో చిమ్మటలు రావడం, నిస్సత్తువగా అనిపించడం లేదా సూదులతో గుచ్చినట్లుగా అనిపించడం కూడా ప్రమాద సూచికలుగా చెబుతున్నారు. రక్త ప్రసరణ తగ్గిపోవడంతో నరాలకు సరైన ఆక్సిజన్, పోషకాలు అందక ఈ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కాళ్లు ముడుచుకుని కూర్చోవడం లేదా సరైన కుర్చీలు ఉపయోగించకపోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరిగి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల వచ్చే అత్యంత ప్రమాదకర పరిస్థితి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT). కాళ్ల లోతైన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆ గడ్డ రక్తప్రసరణ ద్వారా ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ సమస్యలను నివారించడానికి చిన్న చిన్న అలవాట్లే చాలనని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం, కాళ్ల వ్యాయామాలు చేయడం మంచిది. కూర్చునేటప్పుడు రెండు కాళ్లను నేలపై సరిగా ఉంచడం, కాళ్లు మడవకుండా ఉండడం, రోజులో కొంతసేపు కాళ్లను గుండె స్థాయి కంటే ఎత్తుగా పెట్టుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజంతా కుర్చీలో కూర్చోవడం తప్పనిసరి అయినా, కాళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న లక్షణాలను ముందుగానే గుర్తిస్తే భవిష్యత్తులో తీవ్రమైన రక్తనాళాల సమస్యలను నివారించవచ్చు.