Black Cumin | జీలకర్రను మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. ఇది వంటలకు చక్కని రుచి, వాసనను అందజేస్తుంది. ఆయుర్వేద ప్రకారం జీలకర్రలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. జీలకర్రను పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల పలు వ్యాధులు సైతం నయమవుతాయి. అయితే మనకు సాధారణ జీలకర్రతోపాటు నల్ల జీలకర్ర కూడా మార్కెట్లో లభిస్తుంది. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. నల్ల జీలకర్రను ఎంతో కాలం నుంచి ఆయుర్వేదతోపాటు సంప్రదాయ యునాని వైద్య విధానంలోనూ ఉపయోగిస్తున్నారు. నల్ల జీలకర్రలో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. నల్ల జీలకర్రలో థైమోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకంగా పనిచేస్తుంది. అందువల్ల నల్ల జీలకర్రను తింటే శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. నల్ల జీలకర్రను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థ కణాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు, రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు.
నల్ల జీలకర్రను శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాల కారణంగా ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస మార్గాలు క్లియర్ అవుతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. నల్ల జీలకర్ర అనేక జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయ గోడల పొరను సంరక్షిస్తుంది. దీని వల్ల అల్సర్లు రాకుండా ఉంటాయి. కడుపులో మంట కూడా తగ్గుతుంది. నల్ల జీలకర్ర నుంచి తీసే నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నూనెను రాస్తుంటే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే మొటిమలు సైతం తగ్గిపోతాయి. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. యవ్వనంగా మారుతారు. అలాగే ఈ నూనెను శిరోజాలుకు రాస్తుంటే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.
నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను సంరక్షిస్తాయి. దీని వల్ల లివర్ వాపు తగ్గిపోతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. ఇలా నల్ల జీలకర్రను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వీటిని ఎలా తినాలి..? అని చాలా మందికి సందేహం ఉంటుంది. నల్ల జీలకర్రను పెనంపై కాస్త వేయించి పొడి చేసి దాన్ని మీరు రోజూ తినే కూరలపై చల్లి తినవచ్చు. లేదా సూప్‌లలో కలిపి తాగవచ్చు. కూరగాయల సలాడ్‌పై చల్లి కూడా తినవచ్చు. ఇలా నల్ల జీలకర్రను ఎలా తీసుకున్నా కూడా లాభాలు కలుగుతాయి.