ఇంట్లో మెంతికూర వండితే చాలు.. అమ్మో ఆ చేదు రుచి మాకొద్దంటారు చాలామంది. కానీ, చేదులోనే మంచి ఉందన్న విషయాన్ని గ్రహించకుండా ఏదేదో తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మెంతి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్.. మన ఆరోగ్యానికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెంతి ఆకుల్లో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది.
షుగర్‌తో బాధపడేవారికి మెంతికూర ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని చెక్కర స్థాయులను నియంత్రిస్తుంది. ఈ కూరలో ఉండే ఫైబర్ పేగులను శుభ్రం చేసి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు మెంతికూరతో వండిన పదార్థాలు తినడం ఉత్తమం.
మెంతి ఆకుల్లోని ఫ్లేవనాయిడ్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సాయపడతాయి. అలాగే కీళ్ల మంట, వాపు సమస్యలను నివారిస్తాయి. మెంతి ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. మెంతిలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి రక్తహీనత రాకుండా కాపాడుతుంది. తద్వారా శరీరానికి ఆక్సిజన్ సరఫరా ఎక్కువ పెరగడంతో మరింత శక్తిమంతంగా తయారవుతాం. మెంతి కూర తినడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా మెరుగవుతుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.