Gandhi Jayanti | మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారు మనదేశంలో అడుగడుగునా కనిపిస్తారు. అయితే, గాంధీజీ పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అనుసరించిన జీవనశైలిని అతి తక్కువమంది మాత్రమే ఫాలో అవుతుంటారు. అనారోగ్యకరమైన ఆహారం, అపసవ్య జీవనశైలితో.. నేటితరం నడి వయసులోనే వార్ధక్యాన్ని సమీపిస్తున్నది. అలాంటివాళ్లంతా.. ఏడుపదుల వయసులోనూ చలాకీగా కనిపించిన గాంధీజీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని నమ్మే మహాత్ముడి సిద్ధాంతాలను ఒంట బట్టించుకోవాలి.
మహాత్మాగాంధీ పూర్తి శాకాహారి. మితాహారి కూడా! ఆహారం విషయంలో ఆయన కచ్చితంగా ఉండేవారు. తన రోజూవారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకొనేవారు. దంపుడు బియ్యంతో చేసిన అన్నం మాత్రమే తీసుకొనేవారు. వీటిలో అధికంగా ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి. శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. పచ్చి కూరగాయలను తినడానికి ఇష్టపడే వారు. అవికూడా సేంద్రియ పద్ధతుల్లో పండించినవే! వండటం వల్ల కూరగాయల్లోని పోషకాలు పోతాయనీ, పచ్చిగా తింటేనే వాటిలోని ప్రొటీన్లు, విటమిన్లు పూర్తిస్థాయిలో మన శరీరానికి అందుతాయని చెప్పేవారాయన. తృణధాన్యాలతో చేసిన రొట్టెలను రోజూ తప్పకుండా తినేవారు. ముఖ్యంగా సాయంత్రాల్లో కూరగాయల సలాడ్ తీసుకొనేవారు. హెర్బల్ టీ తయారీలో బెల్లం మాత్రమే వాడేవారు. చక్కెరను పక్కన పెట్టేవారు. ఆయన శాకాహారి కాబట్టి, శరీరానికి కావాల్సిన మాంసకృత్తులను పొందడానికి డ్రైఫ్రూట్స్ను ఆశ్రయించేవారు.
గాంధీజీ ప్రతిరోజు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచేవారు. నడకను మించిన వ్యాయామం లేదనేవారు. ఇక ప్రాణాయామం.. ఆయన దినచర్యలో భాగం. సాయంత్రం వేళల్లోనూ తక్కువస్థాయి వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానంలాంటి అనారోగ్యకరమైన అలవాట్లకు ఆయన పూర్తి వ్యతిరేకం. ఈ రెండిటినీ నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ఇవి అధిక చెడు ప్రభావాన్ని చూపుతాయని ఎప్పుడూ చెబుతుండేవారు. పర్యావరణ పరిశుభ్రతకూ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు గాంధీజీ. పర్యావరణం బాగుంటేనే మనిషి ఆరోగ్యం బాగుంటుందని నమ్మేవారు. వ్యక్తిగత శుభ్రతనూ కచ్చితంగా పాటించేవారు.
అందరూ విలువను బంగారంలోనూ, వెండిలోనూ వెతుక్కుంటారు. కానీ, అసలైన విలువ అనేది మన ఆరోగ్యంలోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం!
– మహాత్మా గాంధీ