Blood Circulation | మన శరీరంలో అన్ని భాగాలకు, కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా రవాణా అయ్యేందుకు గాను రక్త సరఫరా వ్యవస్థ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. రక్త సరఫరా సరిగ్గా ఉంటేనే అన్ని భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ లభిస్తాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని రకాల కారణాల వల్ల కొందరిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో పలు వ్యాధులు వస్తుంటాయి. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనే వ్యాధి ఉన్నవారిలో, డయాబెటిస్ ఉన్నా, అధికంగా బరువు ఉన్నవారిలో, పొగ తాగేవారిలో, డీప్ వీన్ త్రాంబోసిస్ (డీవీటీ) అనే సమస్య ఉన్నవారిలో, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ (సీవీఐ) అనే సమస్య ఉన్నవారిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. అలాగే నిత్యం గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసేవారు, బీపీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారిలో కూడా రక్త సరఫరా సక్రమంగా ఉండదు.
రక్త సరఫరా సరిగ్గా లేకపోతే మన శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. చేతులు, పాదాల్లో స్పర్శ లేనట్లు అనిపిస్తుంది. కొన్ని సార్లు ఆయా భాగాల్లో సూదులతో గుచ్చినట్లు కూడా అనిపిస్తుంది. పాదాలు, మడమలు వాపులకు గురవుతాయి. వేలితో నొక్కితే సొట్ట పడుతుంది. తరచూ కండరాల నొప్పులు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి పూట కాలి పిక్కలు తరచూ పట్టుకుపోతుంటాయి. రక్త సరఫరా సక్రమంగా లేనివారి శరీరం మొత్తం పాలిపోయినట్లు కనిపిస్తుంది. కళ ఉండదు. గాయాలు, పుండ్లు నెమ్మదిగా మానుతాయి. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. జుట్టు రాలిపోతుంది. కాళ్లు, చేతులపై ఉండే వెంట్రుకలు కూడా బాగా రాలిపోతుంటాయి. ఇవన్నీ శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగడం లేదని తెలియజేసే లక్షణాలు.
శరీరంలో రక్త సరఫరా సక్రమంగా సరిగ్గా ఉండకపోతే దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. సాధారణంగా దీన్ని కనిపెట్టలేరు. కానీ పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. రక్త సరఫరా సక్రమంగా లేని వారికి డాక్టర్లు మందులను సూచిస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అలాగే రోజూ తప్పనిసరిగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వేళకు భోజనం చేయాలి. నిద్రపోవాలి. రోజుకు తగినంత మోతాదులో నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీని వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
రక్త సరఫరా సక్రమంగా లేని వారు కచ్చితమైన డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో ప్రాణాంతక పరిస్థితులు రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా బీట్ రూట్, పాలకూర, చేపలు, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి ఆహారాలను తింటుండాలి. వీటిల్లో అనేక సమ్మేళనాలతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు, రాస్ప్ బెర్రీలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ వంటి పండ్లు కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్, వెల్లుల్లి, క్యాప్సికం, పసుపు వంటి ఆహారాలను తింటున్నా కూడా సమస్య తగ్గుతుంది. ఇలా రక్త సరఫరాను మెరుగు పరుచుకుని గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.