Body Detox Signs | ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా గడుపుతున్నారు. దీని వల్ల భోజనం వేళకు చేయడం లేదు. అలాగే వేళకు నిద్రిండం లేదు. శారీరక శ్రమ అసలే ఉండడం లేదు. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి జీవనశైలి ఉంటే చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అధికంగా బరువు పెరుగుతారు. ఇది క్రమేపీ హైబీపీ, గుండె జబ్బులకు కారణమవుతుంది. కనుక ఈ ముప్పు రాకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. అలాగే శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించాల్సి ఉంటుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతే మనకు పలు సంకేతాలను ఇస్తుంది. దీంతో మనం అప్రమత్తం అయి మన బాడీని డిటాక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో వ్యర్థాలు మరీ ఎక్కువగా చేరిపోతే అప్పుడు మన నోట్లో బ్యాక్టీరియా సైతం పెరుగుతుంది. దీంతో నాలుకపై తెల్లని ప్యాచ్‌లుగా వస్తాయి. అలాగే నోటి దుర్వాసన ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే మన శరీరంలో వ్యర్థాలు అధికంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే శరీరాన్ని డిటాక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొటిమలు, చర్మంపై దురద లేదా దద్దుర్లు రావడం, చర్మం డల్‌గా మారిపోవడం.. వంటి లక్షణలు కనిపిస్తున్నా కూడా శరీరంలో టాక్సిన్లు చేరాయని అర్థం చేసుకోవాలి. తీవ్రమైన అలసట, నీరసం, రాత్రంతా నిద్రించినా కూడా ఉదయం నిద్ర లేవగానే బద్దకంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా చేరాయని అర్థం చేసుకోవాలి.
శరీరంలో టాక్సిన్లు అధికంగా చేరిన వారికి తరచూ కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ మందగించడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. విపరీతమైన తలనొప్పి రావడం, అది కూడా తరచూ రావడం వంటి లక్షణాలు కూడా టాక్సిన్లు పేరుకుపోయాయని చెప్పేందుకు సంకేతాలుగా భావించవచ్చు. అలాగే శరీరంలో టాక్సిన్లు ఎక్కువగా చేరిన వారికి తీపి తినాలనే కోరిక అధికంగా ఉంటుంది. జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. అనారోగ్య కరమైన ఆహారాల పట్ల ఆసక్తిని చూపిస్తుంటారు. శరీరంలో వ్యర్థాలు అధికంగా ఉంటే మెదడు పనితీరు సైతం మందగిస్తుంది. జ్ఞాపకశక్తి ఉండదు, ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనిపై దృష్టి పెట్టలేకపోతుంటారు. పనిచేయాలనే ఆసక్తి తగ్గుతుంది.
ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే శరీరాన్ని డిటాక్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు గాను పలు పానీయాలు ఎంతగానో దోహదం చేస్తాయి. గ్రీన్ టీని రోజుకు 2 నుంచి 3 కప్పులు చక్కెర లేకుండా సేవించడం, రోజూ ఉదయం తేనె, నిమ్మరసం నీళ్లను తాగడం, తేనెను ఆహారంలో భాగం చేసుకోవడం, రాత్రి పూట 1 టీస్పూన్ కొబ్బరినూనెను నిద్రించే ముందు తీసుకోవడం, వేపాకులను లేదా కరివేపాకులను, తులసి ఆకులను ఉదయం పరగడుపునే తినడం, వాము నీళ్లు లేదా జీలకర్ర నీళ్లు, మెంతుల నీళ్లను సేవించడం.. వంటి సూచనలు పాటిస్తే శరీరంలోని టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. పైన చెప్పిన లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి.