Seeds | చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలు ఇస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కొన్ని గింజలను చేర్చడం ద్వారా హార్మోన్లు, చర్మం, నిద్ర, ఎముకలు, శక్తి స్థాయిలను సహజంగా మెరుగుపరుచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో గింజలు ఇప్పుడు ముఖ్య భాగంగా మారుతున్నాయి. సరైన గింజలను సరైన పరిమాణంలో తీసుకుంటే శరీరానికి అనేక పోషక ప్రయోజనాలు లభిస్తాయి. చిన్నగా చేర్చినా పెద్ద ప్రభావం ఉంటుందనే విధంగా ఈ గింజలు పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజు వారీ ఆహారంలో చేర్చుకోదగిన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గింజల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
ఆహారంలో తీసుకోవాల్సిన గింజల్లో చియా గింజలు ఒకటి. చియా గింజలు (Chia seeds) చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వల్ల ఒమెగా-3 ఫ్యాట్స్ ద్వారా చర్మ రక్షణ మెరుగవుతుంది. ఇవి నీటిని పీల్చుకుని జెల్లా మారడం వల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే అవిసె గింజలు (Flaxseeds) హార్మోన్ సమతౌల్యానికి ఉపయోగపడతాయి. రోజుకు ఒక టీ స్పూన్ తీసుకుంటే ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. వీటిలో ఉండే లిగ్నాన్స్ హార్మోన్ల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా గుమ్మడి గింజలు (Pumpkin seeds) నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల శరీరానికి రిలాక్సేషన్ కలిగించి మంచి నిద్రకు దోహదపడతాయి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక నువ్వులు (Sesame seeds) ఎముకల బలాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే కాల్షియం, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు లభించి ఎముకల దృఢత్వం పెరుగుతుంది. అలాగే జాయింట్ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలు (Sunflower seeds) రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో విటమిన్ ఇ, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీర కణాలను రక్షించి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. అలాగే గార్డెన్ క్రెస్ సీడ్స్ (Garden cress seeds ) రక్తహీనత తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు ఒక టీ స్పూన్ తీసుకుంటే ఐరన్ స్థాయిలు పెరిగి హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది, అలసట తగ్గుతుంది. ఈ గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, పరిమాణం కంటే నియమితంగా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలను ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకుంటే సహజంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.