Zinc Deficiency | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం అయ్యే అనేక పోషకాల్లో జింక్ కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. జింక్ మినరల్స్ జాబితాకు చెందుతుంది. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వహించేందుకు సహాయం చేస్తుంది. జింక్ మనకు అనేక రకాల ఆహారాల ద్వారా లభిస్తుంది. వృక్ష సంబంధ లేదా జంతు సంబంధ ఆహారాలు వేటిని తీసుకున్నా సరే జింక్‌ను పొందవచ్చు. జింక్ వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే జింక్ వల్ల చర్మం సురక్షితంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానాలంటే కూడా జింక్ అవసరం అవుతుంది. జింక్ ఉన్న ఆహారాలను తీసుకుంటే వాపులు సైతం తగ్గిపోతాయి. ఇలా జింక్ మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
తృణ ధాన్యాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఫైబర్ అధికంగా లభిస్తుంది. అలాగే జింక్ ను కూడా వీటి ద్వారా పొందవచ్చు. గోధుమలు, బ్రౌన్ రైస్, కినోవా, ఓట్స్ వంటి ఆహారాలను రోజూ తింటుంటే జింక్ సులభంగా లభిస్తుంది. అలాగే పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా దీన్ని పొందవచ్చు. పాలు, చీజ్, పెరుగు, నెయ్యి తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటి ద్వారా కేవలం జింక్ మాత్రమే కాకుండా క్యాల్షియంను కూడా పొందవచ్చు. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, పల్లీలు, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, చియా సీడ్స్, పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల కూడా జింక్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ గింజలు లేదా విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తీసుకుని నీటిలో నానబెట్టి తింటుంటే ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఆలుగడ్డలు, బీన్స్, బ్రోకలీ, పుట్ట గొడుగులు, వెల్లుల్లి, ఉల్లిపాయలను రోజూ తింటున్నా కూడా జింక్‌ను పొందవచ్చు.
ఇక మన శరీరంలో జింక్ లోపం ఉంటే పలు లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గుతారు. గాయాలు, పుండ్లు మానడం ఆలస్యం అవుతుంది. అప్రమత్తంగా ఉండలేకపోతుంటారు. బద్దకంగా అనిపిస్తుంది. రుచి, వాసన చూసే శక్తిని కోల్పోతారు. విరేచనాలు అవుతుంటాయి. ఆకలిగా ఉండు. ఆహారం తినాలనిపించదు. చర్మంపై ఉండే రంధ్రాలు తెరుచుకుని చర్మం అంద విహీనంగా కనిపిస్తుంది. ఇలా జింక్ లోపం ఉంటే మన శరీరం మనకు ఆయా లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. జింక్ లోపం ఉన్నవారు సాధారణంగా ఆయా ఆహారాలను తీసుకుంటే ఈ లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు. అలాగే వైద్యులు పరీక్షలు చేసి మందులను సైతం ఇస్తారు. వాటిని కూడా క్రమం తప్పకుండా వాడుతున్నా ఉపయోగం ఉంటుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పురుషులకు రోజుకు 11 మిల్లీగ్రాముల వరకు జింక్ అవసరం అవుతుంది. అదే స్త్రీలకు అయితే రోజుకు 8 మిల్లీగ్రాముల వరకు జింక్ కావల్సి ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు రోజుకు 12 మిల్లీగ్రాముల వరకు జింక్ లభించేలా చూసుకోవాలి. జింక్ లోపిస్తే సాధారణంగా ఆహారాలను తీసుకుంటుంటే సరిపోతుంది. కానీ వైద్య చికిత్స ద్వారా ఈ లోపాన్ని అధిగమిస్తే మేలు జరుగుతుంది. దీని వల్ల మళ్లీ ఈ లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే సమతుల ఆహారాన్ని రోజూ తీసుకుంటే జింక్ మాత్రమే కాదు, అసలు పోషకాహార లోపమే రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.