Fatty Liver Causes | మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవాల్లో లివర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అయితే మనం పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా లివర్ లో కొవ్వు చేరుతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. లివర్‌లో కొవ్వు చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ సమస్యగా చెబుతారు. దీనికి వైద్య చికిత్స అవసరం. డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. అయితే మన రోజువారి దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోయేందుకు మనం పాటించే ఆ అలవాట్లు, చేసే తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం విపరీతంగా సేవించే వారిలో మాత్రమే కాదు, అప్పుడప్పుడు మద్యం సేవించినా కూడా దాని ప్రభావం లివర్‌పై పడుతుంది. మద్యం సేవించే సమయంలో చాలా మంది కొవ్వు పదార్థాలను, జంక్ ఫుడ్ లేదా నూనె పదార్థాలను తింటారు. దీంతో లివర్‌పై మరింత భారం పడుతుంది. ఫలితంగా లివర్‌లో కొవ్వు చేరుతుంది. మద్యం సేవించడం వల్ల లివర్ లో కొవ్వు చేరితే దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తారు. మద్యం సేవించడం వల్ల లివర్‌లో అసిటాల్డిహైడ్ అనే సమ్మేళనం పేరుకుపోతుంది. దీంతో లివర్‌లో కొవ్వు కణాలు పెరిగిపోతాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుంది. క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలను లేదా ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తరచూ తింటున్నా కూడా లివర్‌లో ఫ్యాట్ చేరుతుంది. ఇలా వచ్చే ఫ్యాటీ లివర్‌ను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అయితే ఈ రెండు రకాల వ్యాధుల్లోనూ ఒకే తరహా లక్షణాలు కనిపిస్తాయి.
ఫ్యాటీ లివర్ సమస్య వస్తే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. అధికంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు అధికంగా చేరుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. ఆకలి కూడా సరిగ్గా ఉండదు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే లివర్‌లో కొవ్వు చేరిందని గుర్తించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే లివర్ వ్యాధి వచ్చి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక చక్కెర అధికంగా ఉండే స్వీట్లు, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, సోడాలు వంటి పానీయాలను తాగుతున్నా కూడా లివర్ లో కొవ్వు చేరుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను కలగజేస్తుంది. అలాగే రోజూ ఎలాంటి శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకుండా గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నా కూడా లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. షుగర్ వచ్చే చాన్స్ కూడా ఉంటుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలను తరచూ తింటున్నా కూడా లివర్‌లో కొవ్వు చేరుతుంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, వేపుళ్లు, నూనె పదార్థాలను తింటే లివర్‌లో కొవ్వు చేరి అది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది. ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా కొన్నిసార్లు ఆహారం తినడం మానేస్తుంటారు. లేదా వేళ తప్పించి భోజనం చేస్తారు. కొందరు అతిగా ఆహారం తింటారు. ఇవన్నీ ప్రమాదకరమైన అలవాట్లు. లివర్ ఆరోగ్యాన్ని గణనీయంగా దెబ్బ తీస్తాయి. ఈ అలవాట్ల వల్ల లివర్‌లో కొవ్వు కణాలు పెరిగిపోతాయి. దీంతో ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఇలా పలు రకాల అలవాట్లతోపాటు మనం చేసే తప్పుల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే ఆరంభంలోనే ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకుని లివర్‌ను కాపాడుకోవచ్చు. కనుక లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవనశైలిని తప్పక పాటించాలి.