Chapati-White Rice | గతంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి వేళ భోజనం చేసినా పెద్దగా తేడా ఉండేది కాదు.. కాల క్రమేణా శారీరక శ్రమ తగ్గిపోయి, ఏసీ రూముల్లో సీట్ల ముందు పని చేయడం ఎక్కువ కావడంతో యువతలో ఊబకాయం పెరిగిపోయింది. తమ ఆరోగ్యానికి తలనొప్పిగా పరిణమించిన ఊబకాయాన్ని, బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ అన్ని విధాల తాపత్రయ పడుతుంటారు. ఇందులో భాగంగా రాత్రివేళ అన్నం బదులు చపాతీలు తినడం ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా అన్నానికి బదులు రాత్రి వేళల్లో చపాతీలు తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఒక పూట పూర్తిగా అన్నం పూర్తిగా మానేయడానికి బదులు తక్కువ అన్నం తిని, ఎక్కువ చపాతీలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
రాత్రి వేళల్లో వేడివేడి చపాతీలు తినేకంటే నిల్వ ఉంచిన చపాతీలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పటికప్పుడు తయారు చేసే వేడి వేడి చపాతీల్లో నూనె ఎక్కువగా ఉంటుందని, అలా కాక, నిల్వ ఉంచిన చపాతీలు, రోటీల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. నిల్వ ఉంచిన చపాతీలు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, అల్సర్, గ్యాస్ తదితర కడుపు సంబంధ రోగాలు తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. అలాగే రక్త హీనత సమస్యతో బాధ పడే వారు కూడా చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చునని చెబుతున్నారు.