Health | మనకు అండగా నిలిచే వ్యక్తిని ‘కుడి భుజం’ అంటాం. అంగబలానికి, అర్థబలానికి భుజబలం తోడైతే తిరుగేలేదని చెబుతాం. భుజం భుజం కలిపి.. అంటూ సమైక్యతను చాటుతాం. ఈ పద ప్రయోగాలు భుజానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి. భుజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. శరీరంలో చురుకైన కదలికలు ఉంటాయి. చిన్నాపెద్దా పనులు స్వతంత్రంగా చేసుకోగలం. కానీ చాలామంది భుజానికి సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మనిషి తన పనులు తాను చేసుకోవాలన్నా.. ఉపాధి మార్గాలు వెతుక్కోవాలన్నా కాళ్లూ చేతులూ పనిచేయాలి. ఆ రెండు వ్యవస్థలూ సక్రమంగా ఉంటేనే మనుగడ. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు చాలామంది. ప్రత్యేకించి మోకాళ్ల నొప్పి, భుజం నొప్పితో బాధపడేవారి సంఖ్య మరింత పెరుగుతున్నది. మోకాళ్ల నొప్పి వయోధికులలో ఎక్కువగా కనిపిస్తుండగా, భుజానికి సంబంధించిన సమస్యలు మాత్రం అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడుతున్నాయి. అదనంగా.. పోషక విలువల లోపాలు, ప్రమాదాల్లో తీవ్ర గాయాలు కూడా భుజాలను శక్తిహీనం చేస్తున్నాయి.
చాలామంది భుజాల సమస్యలను ప్రారంభ దశలో పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ దశకు వచ్చేసరికి.. ఓ మోస్తరు వస్తువులను కూడా పైకి లేపలేకపోతారు. చిన్నచిన్న పనులు కూడా చేసుకోలేకపోతారు. ప్రధానంగా నాలుగు రకాల రుగ్మతలు మనల్ని ఇబ్బందిపెడతాయి. అవి..
ఈ సమస్య ప్రధానంగా మధుమేహ రోగుల్లో కనిపిస్తుంది. ఇతరులకూ రావచ్చు. కారణం ఏమైతేనేం, భుజం కీలు చుట్టూ ఉండే ‘క్యాప్సుల్’ పొర బిగుసుకుపోవడం వల్ల ఫ్రోజెన్ షోల్డర్ సమస్య తలెత్తుతుంది. ఈ ఇబ్బంది 40-60 ఏండ్ల వారిలో అధికం. ప్రమాదకరం కాకపోయినా, దీర్ఘకాలం బాధపెడుతుంది.
ఎక్స్‌రే ద్వారా గుర్తించలేం. రోగి లక్షణాలను బట్టి ఎంఆర్ఐ ద్వారా నిర్ధారించే వీలుంది.
ప్రారంభ దశలో గుర్తిస్తే చిన్నపాటి వ్యాయామాల ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఇంటి దగ్గరే ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు హైడ్రోడైలటేషన్ పద్ధతిలో ఇంజెక్షన్ సాయంతో ఉపశమనం కలిగించవచ్చు. ఏ పద్ధతులూ పనిచేయనప్పుడు షోల్డర్ ఆర్థోస్కోపీ విధానమే పరిష్కారం.
షోల్డర్ డిస్లొకేషన్.. దీన్నే వాడుక భాషలో భుజం కీలు జారడం, భుజం జారడం అంటారు. ఈ సమస్య ఉన్న రోగులలో భుజంలోని బంతిని పోలిన ఓ భాగం.. దాని చుట్టూ ఉండే గూడులోంచి పక్కకు జరుగుతుంది. దీంతో భుజాన్ని కదిపినప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ సమస్య ఎక్కువగా 15-40 ఏండ్ల వారిలో కనిపిస్తుంది. చేతిని పైకెత్తినప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, నిద్రలో బరువంతా ఒకేవైపు వేసినప్పుడు కీలు జారే ఆస్కారం ఉంది. దీనివల్ల అసౌకర్యంగానూ, నొప్పిగానూ ఉంటుంది.
ఎంఆర్ఐ ద్వారా గుర్తించవచ్చు.
సాధారణంగా ‘ల్యాబ్రమ్’ అనే పొర దెబ్బతినడం వల్ల భుజంలోని కీలు గూడు జారిపోతుంది. ఈ సమస్యకు షోల్డర్ ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా చికిత్స చేస్తారు. ఇక్కడ, సాధారణ సర్జరీలా పొడవైన కోత పెట్టకుండా చిన్నపాటి రంధ్రం చేసి కీలును సరిచేస్తారు. ఇది డే కేర్ సర్జరీ. దవాఖానాకు ఉదయం వెళ్లి సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఈ చికిత్సలో కోత ఉండదు కాబట్టి, నొప్పి కూడా తక్కువే. రోగి త్వరగా కోలుకుంటారు. మూడు నాలుగు రోజుల్లోనే సొంతంగా పనులు చేసుకోవచ్చు. క్రీడాకారులు నెలల వ్యవధిలోనే మైదానంలో అడుగుపెట్టవచ్చు. నిక్షేపంగా వ్యాయామాలూ చేసుకోవచ్చు.
షోల్డర్ ఆర్థరైటిస్ లేదా భుజం కీళ్ల అరుగుదల కూడా తీవ్ర సమస్యే. మోకీళ్లు అరిగినట్టే, భుజం కీళ్లు కూడా అరుగు తాయనే విషయం చాలామందికి తెలియదు. అరవై నిండినవారిలో ఈ ఇబ్బంది అధికంగా కనిపిస్తుంది. షోల్డర్ ఆర్థరైటిస్‌కు వృద్ధ్దాప్యమే తొలి శత్రువు.
షోల్డర్ అర్థరైటిస్‌ను సాధారణ ఎక్స్‌రేతో నిర్ధారించవచ్చు. ఆ నివేదిక ఆధారంగా భుజంలోని కీళ్ల అరుగుదలను తెలుసుకోవచ్చు.
ప్రారంభదశలో కొన్నిరకాల వ్యాయామాల (ఫిజియోథెరపీ)తో పాటు మందుల ద్వారా ఉపశమనం కలిగించవచ్చు. సమస్య తీవ్రమైపోయి.. భుజం కీళ్లు ఎక్కువ అరుగుదలకు గురైనప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ తప్పదు. ఆ శస్త్ర చికిత్సతో రోగి సాధారణ స్థితికి వచ్చేస్తారు.
షోల్డర్ రొటేటర్ కఫ్ టేర్స్ లేదా భుజం కండరాల చీలికలు అనేవి ప్రమాదాల్లో దెబ్బతగిలినప్పుడు ఏర్పడతాయి. వయసురీత్యా వచ్చే కండరాల బలహీనత వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు చేయి పైకెత్తినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. బరువులు మోయాలంటే విల
విల్లాడి పోతారు.
ఈ సమస్యను ఎక్స్‌రే ద్వారా గుర్తించలేం. ఎంఆర్ఐ స్కాన్ ద్వారానే కచ్చితంగా నిర్ధారించవచ్చు.
భుజం కండరాల్లో చీలిక చిన్నగా ఉన్నప్పుడు.. కొన్ని వ్యాయామాలు, ఇంజెక్షన్ల ద్వారా నయం చేయవచ్చు. సమస్య తీవ్రత పెరిగినప్పుడు.. షోల్డర్ ఆర్థోస్కోపీ పద్ధతిలో కండరాల చీలికను కలపడానికి కుట్టు వేయవచ్చు. లోకల్ అనస్థీషియా ద్వారా లోపాన్ని సరిచేయవచ్చు. ఈ చికిత్సా పద్ధతిలో రోగిని అదే రోజు సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి, భుజాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా.. ధైర్యంగా చికిత్స చేయించుకోవచ్చు. ఎంత త్వరగా వైద్యులను సంప్రదిస్తే అంత మంచిది. సరైన పోషకాహారం, రోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అన్నన్ని బరువులు మోసే భుజాన్ని రక్షించుకోవడం మన బాధ్యత.
…మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ బి.చంద్రశేఖర్హెడ్ ఆఫ్ షోల్డర్ సర్జరీ సన్‌షైన్-కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్