ఇది ఎండకాలం. ఎండలు మండే కాలం. నిన్నటి ఉష్ణోగ్రతను నేటి ఉష్ణోగ్రత అధిగమిస్తున్నది. కాలంతోపాటే మన అలవాట్లు, ఆహార విధానంలో మార్పులు రావాలి. లేకపోతే భగభగ మండే ఎండ శరీరంలోని నీటిని గటగటా తాగేస్తుంది. ఒంట్లో హుషారు పుట్టించే లవణాలన్నీ ఆవిరైపోతే దినచర్య నీరసమైపోతుంది. ఎండకాలంలో హుషారుగా, హాయిగా ఉండాలంటే చల్లని జాగ్రత్తలు ఎన్నో పాటించాలి.
ఈ వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎండల కారణంగా పెరుగుతున్న వేడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ కాలంలో వడగాలుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. పైగా పిల్లలకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి, ఆరుబయట ఆటపాటల్లో మునిగిపోతారు. ఇలాంటప్పుడు వారు డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడొచ్చు.
వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు వడదెబ్బ, హెపటైటిస్ బారినపడే ప్రమాదం ఉంది. ఇక ఎండకాలం విద్యార్థులకు పరీక్షలు, ఎంట్రెన్సుల సమయం. ఎండల్లో బయటికి పోవడం తప్పనిసరి. ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. ఈ ఎండలో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు (అల్ట్రా వయోలెట్ రేస్) ఉంటాయి. ఈ కిరణాలు చర్మానికి సోకితే క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. ఇన్ని కష్టాలను కొనితెచ్చే ఎండల్ని తప్పించుకునే చల్లని ఉపాయాలు చాలానే ఉన్నాయి. వాటిని పాటిస్తే ఎండకాలం ఎంతో హాయిగా గడిపేయొచ్చు!
శరీరంలో నీరు… అంటే లవణాలు (బాడీ ఫ్లూయిడ్స్) ఎండ వేడికి ఆవిరైపోవడాన్ని ‘డీ హైడ్రేషన్’ లేదా ‘నిర్జలీకరణం’ అంటారు. చిన్నపిల్లలు తరచుగా ఈ సమస్య బారినపడతారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువ. కాబట్టి ఇలా జరుగుతుంది. ఎక్కువ సమయం ఎండలో తిరగడం, వడగాలి వీచేటప్పుడు ఆరుబయట ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. వేసవిలో ఉష్ణ తాపం వల్ల నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఆటపాటల్లో మునిగిపోయి సమయానికి ఆహారం తీసుకోరు. దీనివల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఎదురుకావొచ్చు. ఎండలో తిరిగేటప్పుడు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు, లవణాలు ఆవిరైపోతాయి. ఫలితంగా పిల్లలు నీరసంగా ఉంటారు. ఈ స్థితిలో శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే ‘హీట్ రెగ్యులేషన్ సిస్టం’ (ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ) తక్కువస్థాయిలో పనిచేస్తుంది. ఈ సమయంలో తొందరగా వడదెబ్బకు గురవుతారు. అందుకే సాధ్యమైనంత వరకు పిల్లల్ని ఎండ ఎక్కువగా ఉండే వేళల్లో బయటికి పంపించకపోవడమే శ్రేయస్కరం.
డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటే, వెంటనే పిల్లలకు ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ద్రావణం కొద్దికొద్దిగా తాగించాలి. దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకుపోవాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే ఇంట్లోనే కాచి, చల్లార్చిన గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, చెంచాడు చక్కెర కలిపి తాగించాలి. వీలుంటే కొబ్బరినీళ్లు తాగించడం ఉత్తమం.
వాంతులు, విరేచనాలు తగ్గకపోతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. అప్పటికే రోగి బాగా నీరసంగా ఉంటాడు. శరీరం నీరు, లవణాలను కోల్పోయి ఉంటుంది. కాబట్టి, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ నరహరి
ప్రొఫెసర్, హెచ్‌వోడీ పీడియాట్రిక్
నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీ