Foods For Thyroid Health | ప్రస్తుతం చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఎక్కువ శాతం మందికి అయోడిన్ లోపం కారణంగానే ఇది వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. థైరాయిడ్ గ్రంథి అవసరం అయిన దాని కన్నా అధిక మొత్తంలో హార్మోన్లను విడుదల చేస్తే అప్పుడు ఆ స్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. అదే అవసరం అయిన దాని కన్నా తక్కువ మొత్తంలో హార్మోన్లను స్రవిస్తే ఆ స్థితిని హైపో థైరాయిడ్ అంటారు. రెండు రకాల్లోనూ పలు రకాల లక్షణాలు మనకు కామన్‌గా కనిపిస్తాయి. అయితే ఏ థైరాయిడ్ ఉన్నా సరే అందుకు జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. తరచూ పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను తరచూ తింటుండాలి. దీంతో థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది.
థైరాయిడ్ ఉన్నవారు తాజా పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రోటీన్లు, తృణ ధాన్యాలను కూడా అధికంగానే తీసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, శీతల పానీయాలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తినకూడదు. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటే అందుకు పలు పోషకాలు అవసరం అవుతాయి. సెలీనియం, జింక్, ఐరన్, పలు రకాల బి విటమిన్లు థైరాయిడ్‌కు మేలు చేస్తాయి. కనుక ఈ పోషకాలు ఉండే ఆహారాలను తరచూ తినాలి. థైరాయిడ్ ఉన్నవారికి ఆ సమస్య నియంత్రణలో లేకపోతే గొంతు దగ్గర వాపులు కనిపిస్తాయి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ అయి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాంతకం అవుతుంది.
థైరాయిడ్ కంట్రోల్లో ఉండేందుకు డాక్టర్లు ఇచ్చే మెడిసిన్లను సాధారణంగా ఉదయం పరగడుపునే వేసుకోవాలి. తరువాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి. ఆ తరువాతే ఆహారాలను తినాలి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారి కోసం డాక్టర్లు పోషకాలు ఉండే ట్యాబ్లెట్లను ఇస్తారు. వాటిని డాక్టర్ సూచన మేరకు వాడుతున్నా ఫలితం ఉంటుంది. దీంతో థైరాయిడ్ ను గ్రంథి సక్రమంగా ఉపయోగించుకుంటుంది. థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది. థైరాయిడ్ ఉన్నవారు అయోడైజ్డ్ సాల్ట్‌ను వాడాలి. దీంతో అయోడిన్ లభిస్తుంది. థైనాయిడ్కు ఇది మేలు చేస్తుంది. అలాగే కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలను, ఆల్చిప్పలు, రొయ్యలు వంటి ఆహారాలను తింటున్నా మేలు జరుగుతుంది.
థైరాయిడ్ ఉన్నవారు పెరుగు, పాలు, పనీర్ వంటి ఆహారాలను తీసుకుంటే అయోడిన్‌ను పొందవచ్చు. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. కోడిగుడ్లలోనూ సెలీనియం, అయోడిన్ ఉంటాయి. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటుంటే ఫలితం ఉంటుంది. సెలీనియం అధికంగా ఉండే బ్రెజిల్ నట్స్, పప్పు దినుసులు, పొద్దు తిరుగుడు విత్తనాలను తింటున్నా కూడా మేలు జరుగుతుంది. గుమ్మడికాయ విత్తనాలు, జీడిపప్పు, శనగలు, తృణ ధాన్యాలు, చికెన్‌లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తుంది. కనుక వీటిని కూడా తరచూ తింటుంటే ఉపయోగం ఉంటుంది. థైరాయిడ్ పనితీరు మెరుగు పడేందుకు ఐరన్ అధికంగా ఉండే పాలకూర, తోటకూర, మునగాకులు, ఖర్జూరాలు, బెల్లం, దానిమ్మ పండ్లు వంటి ఆహారాలను తింటుండాలి. ఇలా ఆహారాలను తింటుంటే థైరాయిడ్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.