Coconut Milk | వేసవి కాలంలో కొబ్బరి నీళ్లను తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. శరీరంలోని వేడిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి రక్షిస్తాయి. ఎండ దెబ్బ తగలకుండా చూస్తాయి. ఇలా కొబ్బరి నీటిని తాగితే అనేక లాభాలను పొందవచ్చు. అయితే కొబ్బరి నీళ్లే కాదు, కొబ్బరి పాలు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొబ్బరిని మిక్సీలో పట్టి అందులో నీళ్లను కలుపుతూ ఆ మిశ్రమాన్ని వస్త్రంలో చుట్టి బాగా పిండి కొబ్బరి పాలను తయారు చేస్తారు. ఈ పాలను మనం ఇంట్లోనూ కొబ్బరితో తయారు చేసుకోవచ్చు. కొబ్బరిపాలను రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతుంటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పాలు మనకు ఏవిధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు అంటే సహజంగానే కొందరికి అలర్జీ ఉంటుంది. పాలను తాగితే కొందరికి సరిగ్గా జీర్ణం కావు. అలాగే కొందరికి పాలలో ఉండే లాక్టోజ్ అనే చక్కెర కారణంగా అలర్జీలు వచ్చి దురదలు పెడతాయి. అలాంటి వారందరూ కొబ్బరిపాలను ప్రత్యామ్నాయంగా తాగవచ్చు. వీటిల్లో లాక్టోజ్ ఉండదు. కనుక అలర్జీ బెడద ఉండదు. అలాగే కొబ్బరిపాలలో ఉండే ఫైబర్ పాలను సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణాశయం, పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొబ్బరిపాలలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు లేదా ఇన్ ఫెక్షన్లతో బాధపడుతున్నవారు కొబ్బరిపాలను తాగితే మేలు జరుగుతుంది. కొబ్బరిపాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. కొబ్బరిపాలను తాగుతుంటే జీర్ణాశయంలో ఉండే పుండ్లు, అల్సర్లు నయమవుతాయి.
100 ఎంఎల్ కొబ్బరిపాలను తాగడం వల్ల సుమారుగా 169 క్యాలరీల శక్తి లభిస్తుంది. 1.1 గ్రాముల ప్రోటీన్లు, 16.9 గ్రాముల కొవ్వులు, 14.6 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్స్, 3.3 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల చక్కెర ఉంటాయి. కొబ్బరిలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లతోపాటు లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. అలాగే కొబ్బరిపాలను సేవిస్తే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇలా కొబ్బరిపాలను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.