Cloves Water | మన వంట ఇంటి మసాలా దినుసుల్లో అనేక పదార్థాలు ఉంటాయి. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను చాలా మంది మసాలా కూరల్లో, ఇతర వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు ఘాటైన రుచి, చక్కని వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం లవంగాలను అద్భుతమైన ఔషధంగా చెబుతారు. లవంగాలను రోజూ నేరుగా నమిలి తినవచ్చు. కానీ ఘాటు తట్టుకోలేం అనుకుంటే వీటితో నీళ్లను తయారు చేసి తాగవచ్చు. లవంగాలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో రోజులో ఎప్పుడైనా సరే తాగవచ్చు. ఇలా తాగినా కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాల నీళ్లను తాగితే పలు రోగాలను నయం చేసుకోవచ్చు కూడా. ఈ క్రమంలోనే లవంగాల నీళ్లను రోజూ తాగాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
లవంగాల నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయం సులభంగా జీర్ణం చేస్తుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం జీర్ణాశయ గోడలను సంరక్షిస్తుంది. దీంతో అల్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల లవంగాల నీళ్లను తాగితే రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం సహజసిద్ధమైన అనాల్జెసిక్ గా పనిచేస్తుంది. అంటే నొప్పులను తగ్గిస్తుందన్నమాట. లవంగాల్లో యాంటీ సెప్టిక్ గుణాలు సైతం ఉంటాయి. లవంగాలను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. చిగుళ్ల వాపు, నొప్పి నుంచి బయట పడవచ్చు. లవంగాల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల లవంగాల నీళ్లను తాగితే శరీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అలాగే తలనొప్పి నుంచి బయట పడవచ్చు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం లవంగాల నీళ్లను తాగుతుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. లవంగాల్లో నైజెరిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి లవంగాల నీళ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు లవంగాల నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. సీజనల్ గా వచ్చే రోగాల నుంచి బయట పడవచ్చు. ఇలా లవంగాల నీళ్లను రోజూ తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చు.