Black Grapes | సీజనల్‌గా మనకు లభించే పండ్లను తినడంతోపాటు మార్కెట్లో ఎక్కువగా లభించే పండ్లను కూడా తరచూ తింటుండాలి. అలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక మార్కెట్ లో మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. వీటిలో పలు రకాలు ఉంటాయి. కానీ నలుపు రంగు ద్రాక్షలను తినడం వల్ల మనకు ఎక్కువ మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగు లేదా పర్పుల్ రంగులో ఉండే ద్రాక్షల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ద్రాక్ష పండ్లలో ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. నలుపు రంగు ద్రాక్షలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చని వారు అంటున్నారు. ఈ ద్రాక్షలను కచ్చితంగా రోజూ తినాలని వారు చెబుతున్నారు.
నలుపు రంగు ద్రాక్షలను ఒక కప్పు మోతాదులో తింటే సుమారుగా 90 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 24 గ్రాములు, ఫైబర్ 1 గ్రాము, ప్రోటీన్లు 1 గ్రాము, విటమిన్లు సి, కె, ఎ, బి6, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే నలుపు రంగు ద్రాక్ష పండ్లలో ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, రెస్వెరెట్రాల్, ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనకు భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నలుపు రంగు ద్రాక్ష పండ్లలో ఉండే ఆంథో సయనిన్స్ మన శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ రాదు.
నలుపు రంగు ద్రాక్ష పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన రెస్వెరెట్రాల్, ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఈ పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. హైబీపీ ఉన్నవారికి నలుపు రంగు ద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ ద్రాక్షల్లో ఉండే రెస్వెరెట్రాల్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
ఆకుపచ్చ రంగు ద్రాక్షలను తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ నలుపు రంగు ద్రాక్ష ఇందుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ ద్రాక్షల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ ద్రాక్షలను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా ఈ ద్రాక్షల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా నలుపు రంగు ద్రాక్షలను తినవచ్చు. దీంతో షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నలుపు రంగు ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం రోగాల బారి నుంచి సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. నలుపు రంగు ద్రాక్షలను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా ఈ ద్రాక్షలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.