Magnesium Foods | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. మన శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతాయి. వీటితో మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే శక్తి కూడా లభిస్తుంది. ఇక మన శరీరానికి కావల్సిన మినరల్స్‌లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కండరాల పనితీరుకు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు మెగ్నిషియం అవసరం అవుతుంది. అయితే మెగ్నిషియం కావాలంటే అందుకు గాను ట్యాబ్లెట్లను వాడాల్సిన పనిలేదు. ఖరీదైన చికిత్స తీసుకోవాల్సిన పనిలేదు. పలు పదార్థాల్లోనే మనకు సహజసిద్ధంగా మెగ్నిషియం లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగ్నిషియం మనకు ఏయే ఆహారాల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పులో మెగ్నిషియం సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల బాదంపప్పును తింటే సుమారుగా 270 మిల్లీగ్రాముల మెగ్నిషియం లభిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. కనుక బాదంపప్పును రోజూ తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల కూడా మెగ్నిషియం పొందవచ్చు. 100 గ్రాముల గుమ్మడికాయ విత్తనాలను తింటే సుమారుగా 168 మిల్లీగ్రాముల మెగ్నిషియం లభిస్తుంది. గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల నాడుల పనితీరు మెరుగు పడుతుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. కనుక ఈ విత్తనాలను కూడా రోజూ తినాలి.
బ్లాక్ బీన్స్‌లోనూ మెగ్నిషియం సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల బ్లాక్ బీన్స్‌ను తింటే సుమారుగా 70 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లాక్ బీన్స్ ను తింటే శరీరం అంతటికీ రోజంతా శక్తి లభిస్తుంది. చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి ఉండవు. బ్లాక్ బీన్స్‌లో ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. అలాగే తోఫును ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మెగ్నిషియంను పొందవచ్చు. 100 గ్రాముల తోఫును తింటే 30 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ తోఫును కూడా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
అవకాడోల్లో కూడా మెగ్నిషియం సమృద్ధిగానే ఉంటుంది. అవకాడోలను తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అవకాడోలను తినడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అదేవిధంగా మెగ్నిషియం కోసం డార్క్ చాక్లెట్లను కూడా తినవచ్చు. 100 గ్రాముల డార్క్ చాక్లెట్ల ద్వారా సుమారుగా 228 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మూడ్‌ను మారుస్తుంది. డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మానసికంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక డార్క్ చాక్లెట్లను కూడా తరచూ తింటుండాలి. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తింటుండడం వల్ల శరీరానికి మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.